సాక్షి, న్యూఢిల్లీ : 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర వహించింది. నాడు ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ మీడియాను విజయవంతంగా ఉపయోగించుకోగా, దీనిపట్ల ఇతర పార్టీలకు కూడా క్రమక్రమంగా అవగాహన పెరగడంతో ఇప్పుడు అన్ని పార్టీలు సోషల్ మీడియాను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. నకిలీ వార్తలు, దుష్ప్రచారాలు ఇప్పటికే ఈ మీడియాను వేధిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా ఇవి మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే శక్తులు కూడా పొంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను కట్టడి చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
1. ఎన్నికల కోడ్ సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుంది.
2. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు విధిగా తమ సోషల్ మీడియా ఖాతాలను వెల్లడించాలి.
3. అభ్యర్థులు, పార్టీలు సోషల్ మీడియాపై పెడుతున్న ఖర్చులను కూడా వెల్లడించాలి. మొత్తం అభ్యర్థులు లేదా పార్టీల ఖర్చు పరిమితిలోకే ఈ ఖర్చు కూడా వస్తుంది.
4. సోషల్ మీడియాలో ప్రచార ప్రకటనలకు ఎన్నికల కమిషన్ నుంచి తప్పనిసరి అనుమతి తీసుకోవాలి.
ఎన్నికల కమిషన్ ఈ మార్గదర్శకాలను నిర్దేశించడంతోపాటు ఫేస్‌బుక్, గూగుల్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి మహా సంస్థలతో కూడిన ‘ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’తోని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చర్చలు జరిపింది. ఈ మీడియాను దుర్వినియోగం చేయకుండా వినియోగదారుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, నకిలీ వార్తలను, దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు ఫ్యాక్ట్ చెక్కర్స్‌ను పెడతామని, నకిలీ ఖాతాలపై తగిన చర్యలు తీసుకుంటామని, రాజకీయ ప్రచార వాణిజ్య ప్రకటనలు పారదర్శకంగా ఉండేలా చూస్తామని ఈ కంపెనీలు ఎన్నికల కమిషన్‌కు హామీ ఇచ్చాయి. ఒక్క ఎన్నికల కమిషన్, సోషల్ మీడియా సంస్థల యజమాన్యాల వల్లనే మీడియా దుర్వినియోగాన్ని అరికట్టవచ్చనుకుంటే పొరపాటే. దేశ పౌరులుగా ఇది అందరి బాధ్యత.
Comments
Please login to add a commentAdd a comment