విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, సంగారెడ్డి టౌన్: ఈ నెల 11న జరగనున్న లోక్ సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఎన్నికల విధులకు హాజరుకానున్న సిబ్బందికి శిక్షణ పూర్తయిందన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 1943 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 202 సెక్టార్లకు గాను 202 మంది అధికారులను నియమించామని తెలిపారు.
అధికారులు ఆయా సెక్టార్లలో ఉన్న పోలింగ్ స్టేషన్లను పరిశీలించారని, వారికి పూర్తి స్థాయిలో విషయ పరిజ్ఞానం ఉన్నదన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 129 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, అందుకు పకడ్బందీగా పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఏడు మోడల్ పోలింగ్ స్టేషన్లను, కేవలం మహిళలతో నడపబడే 7 సఖి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, వీఎస్టీ, వీవీటి,ఏ ఈఓ బృందాలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏడు నియమించామని తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు 8471 సిబ్బందిని ఏర్పాటు చేశామని అన్నారు. కావాల్సిన సిబ్బంది కంటే అదనంగా పదిశాతం ఉన్నారని తెలిపారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఏడు సెంటర్లను పోలింగ్ మెటీరియల్ పంపిణీ, స్వీకరణకు గాను ఏర్పాటుచేశామన్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో...
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 14 లక్షల 97వేల 996 మంది ఓటర్లు ఉండగా 7 లక్షల 37వేల 479మంది పురుషులు, 7 లక్షల 60 వేల456 మంది మహిళలు, 61 మంది ఇతరుల ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఇందులో అందోల్ నియోజకవర్గం పరిధిలో ఎక్కువ ఓటర్లు, అతితక్కువగా బాన్స్‌వాడ ఓటర్లు ఉన్నారని అన్నారు. మొత్తంగా 23 వేలమంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. 12 మంది అభ్యర్థులు ఎన్నికల బారిలో ఉండగా 13వ స్థానంలో నోటా ఉన్నట్లు తెలిపారు సంగారెడ్డి జిల్లాలో మొత్తం 12 లక్షల 7 వేల 118 మంది ఓటర్లు ఉండగా 6 లక్షల 11 వేల 4 మంది పురుషులు, 5 లక్షల 96 వేల79 మంది మహిళలు, 35 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నట్లు చెప్పారు. నూతనంగా వీవీప్యాట్ల స్థితిగతులను తెలిపే దృశ్య పరికరం (వీఎస్‌డీయూ)ను పోలింగ్ బూత్‌లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘నా ఓటు’ యాప్ ఫ్రెండ్లీగా ఉందని దీనిలో ఓటరు హెల్ప్ లైన్, ఎన్నికల షెడ్యూల్ తదితర అన్ని వివరాలు ఉంటాయని ఏ యాప్‌ను ఓటర్లు వినియోగించుకోవాలని కోరారు.
పోలింగ్ అయ్యాక జహీరాబాద్ పార్లమెంట్ కు చెందిన ఈవీఎంలు గీతం క్యాంపస్ కు చేరుతాయని, మే 23న జరిగే ఓట్ల లెక్కింపు కూడా అక్కడే ఉంటుందని అన్నారు. ఇప్పటివరకు మెదక్ పార్లమెంటులోని పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజవర్గాలలో రూ.2,97,700 నగదును సీజ్ చేశామని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 11 న జరగబోయే పోలింగ్ సందర్భంగా రెండు కంపెనీల సీఐఎస్‌ఎఫ్, మూడు కంపెనీల గోవా పోలీస్, కర్ణాటక నుండి 300 హోమ్ గార్డులు రానున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర విభగాల ఫోర్స్ రానున్నదని, అవసరమైతే మాజీ సైనిక ఉద్యోగులను, ఎన్‌సీసీ విద్యార్థుల సేవలను తీసుకోవడానికి అనుమతి ఉన్నందున ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఎవరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘుస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదుకాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment