తాడికొండ నియోజకవర్గం ముఖచిత్రం, ఉండవల్లి శ్రీదేవి, తెనాలి శ్రావణ్ కుమార్
సాక్షి,గుంటూరు : ఎందరో ప్రజాప్రతినిధులను, ఐఏఎస్ అధికారులు, వైద్యులు, విద్యావేత్తలను సమాజానికి అందించిన చదువుల కర్మాగారం తాడికొండ గురుకుల పాఠశాల.. ఆంధ్రా రోమ్‌గా కీర్తిపొందిన పుణ్యభూమి ఫిరంగిపురం.. చిరుధాన్యాల పరిశోధన కేంద్రంగా ఏర్పాటై ఎన్జీరంగా విశ్వవిద్యాలయంగా అవతరించిన లాంఫాం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్న నియోజకవర్గం తాడికొండ. ఇది తొలి నుంచి సెంటిమెంట్ నియోజకవర్గంగా జిల్లాలో పేరు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చేది. రాష్ట్ర విభజనానంతరం కూడా ఈ సెంటిమెంటే కొనసాగింది.
భక్తుల కోరిన కోర్కెలు తీర్చే ప్రసిద్ధ ఆలయంగా భాసిల్లుతూ రాష్ట్రంలోనే ప్రధాన చర్చిగా కుల మతాలకు అతీతంగా ప్రార్థనలు జరుపుకొనే ఎత్తయిన చర్చిగా ప్రత్యేకతను సంతరించు కొని ఆంధ్రా రోమ్‌గా కీర్తిపొందిన ఫిరంగిపురం తాడికొండ నియోజకవర్గంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. బాల ఏసు కొలువైన ఫిరంగిపురం కథెడ్రల్ దేవాలయానికి 125 ఏళ్ల గొప్ప చరిత్ర ఉంది.
చదువులమ్మ నిలయం తాడికొండ గురుకులం
1970వ దశకంలో తాడికొండలో ప్రారంభమైన బేసిక్ ట్రైనింగ్ స్కూల్ కాలగమనంలో గురుకుల పాఠశాలగా రూపాంతరం చెందింది. అప్పట్లో ఏడు జిల్లాలకు చెందిన ఎందరో ప్రతిభావంతులు ఇక్కడ చదువుకునేవారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులకు నిలయంగా మారిన తాడికొండ గురుకుల పాఠశాలలో చదువుకున్న వారిలో ఐఏఎస్ అధికారులు కాంతీలాల్ దండే, ధర్మారావు, పార్వతీపురం ఎంపీగా సేవలు అందించిన డి.వి.జి.శంకరరావు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ మండవ శ్రీనివాసరావు వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు.
వ్యవసాయ క్షేత్రం లాంఫాం
తాడికొండ మండలం లాం గ్రామంలో 1942లో చిరుధాన్యాల పరిశోధనా కేంద్రం ప్రైవేటు గృహంలో కొనసాగింది. తదనంతర కాలంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంగా రూపాంతరం చెందింది. అపరాల పరిశోధనతో పాటు పత్తి, ఉద్యాన పరిశోధనా స్థానాలు ఇక్కడ రైతులకు ఎన్నో సేవలు అందించాయి. రాష్ట్ర విభజన అనంతరం వ్యవసాయ విశ్వ విద్యాలయంగా లాం పరిశోధనా స్థానాన్ని ప్రకటించడంతో రాష్ట్ర స్థాయి కార్యకలాపాలు ఇక్కడ నుంచే కొనసాగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు ఇక్కడ ఏర్పాటు చేసిన పశు పరిశోధనా కేంద్రంలో బ్రీడ్ ఉత్పత్తి జరుగుతోంది.
తొలినుంచి సెంటిమెంట్‌కే పట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజధాని నియోజకవర్గమైన తాడికొండ ఉత్కంఠ రేపుతోంది. తొలినుంచి సెంటిమెంట్ నియోజకవర్గంగా పేరొందిన తాడికొండలో ఏ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో అదేపార్టీ అధికారంలోకి వస్తుందనే నానుడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రలో కూడా పునరావృతం అయింది. 1972 ఎన్నికల వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న తాడికొండ 1978 ఎన్నికలకు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా మారింది.
అమలుకాని ప్రభుత్వ హామీలు
జ కొండవీటి వాగు ముంపు నుంచి పంటలను కాపాడేందుకు వాగు పూడికతీత పనులు చేపడ్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరలేదు.
జ తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురంతో పాటు రాజధాని పూలింగ్‌లోకి తీసుకున్న గ్రామాల్లో సైతం ఎన్నికల్లో హామీ ఇచ్చిన తాగునీటి సమస్య పరిష్కారానికి నోచలేదు. వేసవి కాలం వస్తే పలు గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి ఉంది.
ప్రభుత్వం విఫలమైంది ఇలా...
నియోజకవర్గంలో ఒక్క పేదవాడికి ఇళ్ల స్థలం మంజూరుచేయలేదు.
పలు గ్రామాల్లో టీడీపీ నాయకులు అధికారుల అండదండలతో స్థలాలను ఆక్రమించుకొని అక్రమంగా ఇళ్లు నిర్మించి విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
జన్మభూమి కమిటీల పెత్తనంతో అర్హులకు కూడా పింఛన్లు మంజూరవక వృద్ధులు వికలాంగులు, వితంతువులు ఇబ్బందిపడ్డారు.
నీరు– చెట్టు పేరుతో టీడీపీ నాయకులు గ్రామాల్లో యథేచ్ఛగా మట్టి, ఇసుక దోచేశారు. వాటాల పంపకంలో తేడాలు రావడంతో రోడ్డున పడి తిట్టుకున్న సందర్భాలు కోకొల్లలు.
వివిధ కార్పొరేషన్ల రుణాలు అనర్హులకు అందాయి. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అనుయాయులకే కట్టబెట్టి రైతులను విస్మరించారు. రాయితీ ఎరువులు, విత్తనాల సరఫరాలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు టీడీపీ అంటేనే మండిపడుతున్నారు.
మండలాల వారీగా ఓటర్ల వివరాలు
మండలం మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు
తాడికొండ 53,241 27,253 25,985
తుళ్ళూరు 45,368 21,855 23,513
మేడికొండూరు 44,681 22,155 22,522
ఫిరంగిపురం 50,068 24,744 25,324
వైఎస్సార్ కాంగ్రెస్‌వైపే ఓటర్ల మొగ్గు
రాజధాని అమరావతి పేరిట భూ సమీకరణ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రైతులు, రైతు కూలీలు ఐదేళ్లుగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే ఏకపక్ష పనితీరు, అధికార పార్టీ నాయకుల అక్రమాలతో ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. తొలి నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేది. నేడు కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగరేయడం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి స్థానికురాలు కావడం, ఆమె తండ్రి ఉండవల్లి సుబ్బారావుకు స్థానికంగా గట్టి పట్టు ఉండటంతో ఆమె ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
హవా చాటిన స్థానికేతరులు
తాడికొండ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి పురుషులే ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే తొలిసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో మహిళా అభ్యర్థిగా కత్తెర హెనీక్రిస్టినాకు అవకాశం ఇచ్చింది. అయితే ఆమె స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ పార్టీ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని మరోసారి అభ్యర్థిగా బరిలో నిలిపింది. జనరల్ కేటగిరీలో ఉండగా గద్దె రత్తయ్య తుళ్లూరు మండలం మల్కాపురం నుంచి గెలుపొందగా తదనంతరం స్థానికేతరులే ఎక్కువసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో తాడికొండ గ్రామానికి చెందిన ఆడపడుచు ఉండవల్లి శ్రీదేవికి తాడికొండ ప్రజల ఆశీస్సులు మెండుగా లభిస్తాయనే ప్రచారం ఊపందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment