మామూలు విషయాలు కూడా ఎన్నికల సమయంలో వివాదాలకు దారి తీస్తాయనడానికి ఉదాహరణ ‘నమో ఫుడ్స్’. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు ఇచ్చిన ఆహార పొట్లాలపై ఉన్న ‘నమో ఫుడ్స్’ అనే లేబుల్ రాజకీయ వివాదం రేపింది. ‘నమో’ అంటే ప్రధాని నరేంద్ర మోదీ పేరుకు సంక్షిప్త రూపమని, ఆ పొట్లాల ద్వారా పరోక్షంగా బీజేపీకి ప్రచారం చేశారని విపక్షాలతో పాటు పలువురు విమర్శించారు. అయితే ఆ పేరుకు ప్రధానికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఆ కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో గురువారం మొదటి దశ పోలింగ్ జరిగింది. నోయిడాలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఆహార పొట్లాలు అందాయి.
వాటిపై హిందీలో ‘నమో’ అని పెద్దక్షరాలతో ‘ఫుడ్స్’ అని చిన్నక్షరాలతో ఉండటంతో వివాదం రేగింది. అది బీజేపీ ప్రచారమని కొందరంటే, మరికొందరు దీనికి రాజకీయాలకు అంటగట్టొద్దని చెప్పుకొచ్చారు. ఈ వివాదంపై కంపెనీ మేనేజర్ సునీల్ ఆనంద్ స్పందిస్తూ, ఆ పొట్లాలకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. నోయిడా పోలీసులు తమకు 750 తాలీలు ఆర్డరిచ్చారని, ఆ మేరకు వాటిని పంపామని అన్నారు. తమ కంపెనీ పేరు ‘నమో ఫుడ్స్’ అని దీనికి మోదీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. నోయిడాలో తమకు చాలా దుకాణాలున్నాయని కూడా చెప్పారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగు రోజున పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఏ రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి సంబంధించిన ప్రచార సామగ్రి కనబడకూడదు. ఈ విషయమై బీజేపీ ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపడేసింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి మహేశ్‌శర్మ, కాంగ్రెస్ నుంచి అరవింద్ కుమార్ తలపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment