సాక్షి,బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు నగరా మోగిన నేపథ్యంలోమాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ కీలక ప్రకటన చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోల తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే తన స్థానంలో హసన్ లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా తన మనవడు ప్రజ్వాల్ రెవన్నాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దేవెగౌడ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఆయన మనవడు ప్రజ్వల్, కుమారుడు రేవణ్ణ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే తమ అభిమాన నాయకున్ని అలా చూసిన జేడిఎస్ నేతలు, కార్యకర్తలు కూడా కంటనీరు పెట్టుకున్నారు.
హెలెన్సర్‌పూర్ తాలుకా ముదలహిప్పి గ్రామంలో జరిగిన జేడీఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేలా తన మనవడిని ఆశీర్వదించాలని హసన్ నుంచి ఎంపీగా ఉన్న దేవెగౌడ కోరారు. ఇప్పటికి తాను చాలా మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చానని ఇపుడు తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొస్తుంటే మాత్రం కొందరు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారనంటూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఈ సమయంలో పక్కనే వున్న మనువడు ప్రజ్వల్ ఆయన కన్నీటిని తుడిచి ఓదార్చాడం గమనార్హం.
మరో మనవడు నిఖిల్ (సీఎం కుమారస్వామి కుమారుడు)ని సైతం దేవెగౌడ రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాండ్యా లోక్‌సభ నియోజకవర్గం నుంచి నిఖిల్‌కు టికెట్ కేటాయిస్తారని సమాచారం. ఆయన ఎన్నికల్లో పోటీచేస్తారని కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై జేడీఎస్ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు హసన్‌లో ప్రజ్వల్‌పై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఏ.మంజు పోటీకి దిగుతున్నట్టు సమాచారం.
కాగా దేశ రాజకీయాల్లో సీనియర్ నాయకులు, కురువృద్ధులు ఎన్నికల బరినుంచి తప్పుకుంటుండగా, వారి వారసులు రంగంలోకి దిగడం కీలక పరిణామం. ముఖ్యంగా నిన్నగాక మొన్న తన కుటుంబంనుంచి మనువడు (మూడవతరం) పోటీచేస్తారని ఎన్‌సీపీ నేత శరద్ పవార్ ప్రకటించారు. తాజాగా దేవేగౌడ్ మనువడు, కర్నాటక మంత్రి హెచ్‌డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లోక్‌సభ ఎన్నికల ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment