సాక్షి, హైదరాబాద్ : కరోనా నియంత్రణకు సంబంధించి తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా నియంత్రణ, చికిత్స కోసం కేంద్రం కేంద్రం నిధులు ఇవ్వకుండా చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అంటూ చేతులు దులుపుకుందని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నిర్ధారణ కోసం తెలంగాణ తెచ్చుకున్న టెస్టింగ్ మిషన్లను కేంద్రం వేరే రాష్ట్రాలకు తరలిస్తుందని ఆరోపించారు. కరోనా పేరుతో బీజేపీ నాయకులు కంపు రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఇంకెవ్వరికీ లేదని తెలిపారు. మా చిత్తశుద్ధిని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదన్నారు.
కరోనాకు సంబంధించి కేంద్రం ఇప్పటివరకు 214 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని మంత్రి తెలిపారు. టెస్టింగ్‌లు తక్కువ చేస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు వారి ప్రభుత్వం చేసిన ఘనకార్యాన్ని కూడా తెలుసుకోవాలని సూచించారు. రోజుకి 3,500 నుంచి 4,000 పరీక్షలు చేయగల సామర్థ్యం ఉన్న రోస్ కంపెనీకి చెందిన కోబొస్ 8,800 మిషన్లను దేశంలో తొలిసారిగా ఆర్డర్ చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. భారత్‌కు వచ్చిన తొలి మిషన్‌ను కేంద్రం డైవర్ట్ చేసి కోల్‌కతాకు పంపిందని ఆరోపించారు. ఇక, తెలంగాణలో కరోనా టెస్టులు, మరణాలకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలకు కూడా ఈటల గట్టి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి : నడ్డావి పచ్చి అబద్దాలు: ఈటల)
వారం రోజుల్లో గచ్చిబౌలి హాస్పిటల్..
కరోనా బాధితులకు చికిత్స అందించడం కోసం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన హాస్పిటల్‌ను వారం రోజుల్లోగా ప్రారంభించాలని మంత్రి ఈటల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆ హాస్పిటల్‌కు డాక్టర్ విమలా థామస్‌ను నియమించాలని ఆదేశించారు. అందులో పనిచేసే 50 శాతం సిబ్బందిని ఒక వారం పాటు, మిగిలిన 50 శాతం సిబ్బందిని మరో వారం పాటు విధులు నిర్వర్తించేలా విభజించాలన్నారు. మూడు షిఫ్ట్‌లలో సిబ్బంది అందుబాటులోఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment