అంజయ్య సతీమణి మణెమ్మ కన్నుమూత | Ex CM Anjaiah Wife Manemma Passed Away | Sakshi
Sakshi News home page

నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు

Published Mon, Sep 10 2018 1:29 AM | Last Updated on Mon, Sep 10 2018 1:29 AM

Ex CM Anjaiah Wife Manemma Passed Away - Sakshi

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సతీమణి, మాజీ పార్లమెంట్‌ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే టి.మణెమ్మ (75) ఆది వారం కన్నుమూశారు. ఆమెకు నలుగురు కుమార్తె లు, ఒక కుమారుడు ఉన్నారు. రక్తహీనత, జ్వరంతోపాటు మరికొన్ని అనారోగ్య సమస్యలతో ఆమె గత నెల 27న జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించి ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గత మూడేళ్లుగా వయోభారం, అనారోగ్యంతో మణెమ్మ ఇంటికే పరి మితమయ్యారు. ఆమె అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో జరుగుతాయని బంధువులు తెలిపారు.  

రాజకీయ ప్రస్థానం..
1986లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న భర్త టి.అంజయ్య మృతి చెందడంతో ఆ పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మణెమ్మ విజయం సాధించారు.1989లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా రెండవ సారి ఎంపీగా తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖరరెడ్డి ముషీరాబాద్‌ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల్లో మణెమ్మను నిలబెట్టి గెలిపించారు. అనంతరం 2009లో మళ్లీ ముషీరాబాద్‌ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

సీఎం కేసీఆర్‌ సంతాపం..  
మణెమ్మ మృతి పట్ల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో మణెమ్మ అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కేసీఆర్‌ ఆదేశించారు.  

కాంగ్రెస్‌కు తీరని లోటు: ఉత్తమ్‌
మణెమ్మ అకాల మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మణెమ్మ మృతి పట్ల సంతా పం ప్రకటించారు. మణెమ్మ మృతి పట్ల టీపీసీసీ కిసాన్‌సెల్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి కూడా సంతాపం ప్రకటించారు. హోంమంత్రి నాయిని, కెవీపీ రాంచందర్‌రావు, జానారెడ్డి, పొన్నాల, పి.శంకర్‌ రావు, మాజీ ఎంపీ కెఎస్‌.రావు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దంపతులు మణెమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లు ఫోన్‌లో కుటుంబసభ్యులను పరామర్శించారు.

వైఎస్‌ జగన్‌ సంతాపం..
సాక్షి, అమరావతి: మణెమ్మ మృతిపట్ల ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు వైఎస్‌ జగన్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement