సాక్షి, బెంగళూరు : బీజేపీ అధిష్టానం బెంగళూరు సౌత్ లోక్‌సభ సీటును యువ న్యాయవాదికి కేటాయించడం తనను షాక్‌కు గురిచేసిందని తేజస్వినీ అనంతకుమార్ అన్నారు. యడ్యూరప్ప క్యాంపుతో సత్సంబంధాలు కలిగి ఉన్న 28 ఏళ్ల తేజస్వీ సూర్యను తమకు కంచుకోటగా ఉన్న బెంగళూరు సౌత్ స్థానం నుంచి బీజేపీ బరిలో దింపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ టికెట్‌ను ఆశించిన తేజస్వినీ అనంతకుమార్ మాట్లాడుతూ.. ‘ నాతో పాటు మా కార్యకర్తలను ఈ నిర్ణయం ఆశ్చర్యపరిచింది. ఇలాంటి సమయాల్లోనే పరిపక్వత కలిగిన వ్యక్తిగా ఆలోచించాలని నా మనసుకు నచ్చచెప్పుకొన్నా. పార్టీ ఆదేశాల్ని శిరసావహిస్తా. నా భర్త చాలా ఏళ్లపాటు పార్టీ కోసం పనిచేశారు. మాకెప్పుడూ జాతి ప్రయోజనాలే ముఖ్యం. ఆ తర్వాతే పార్టీ, స్వప్రయోజనాలు. ఆ విషయాన్ని నిరూపించుకునే సమయం ఇప్పుడు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో యక్ష ప్రశ్నలు వేసి సమయాన్ని వృథా చేయకండి. దేశానికి సేవ చేయాలని భావిస్తే నరేంద్ర మోదీజీ గెలుపు కోసం కృషి చేయండి’ అని ఆమె పిలుపునిచ్చారు.
కాగా బెంగళూరు సౌత్ నుంచి 1996 నుంచి 2014 వరకూ బీజేపీ దివంగత నేత అనంతకుమార్ విజయబావుటా ఎగురువేశారు. ఆయన మరణంతో ఈ స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పార్టీ భారీ కసరత్తు చేసింది. ఈ క్రమంలో అనంత కుమార్ భార్య తేజస్విని పేరును రాష్ట్ర బీజేపీ వర్గం.. అధిష్టానానికి సిఫారసు చేసింది. అంతేకాదు ఒకానొక సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం అదే స్థానం నుంచి పోటీచేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అర్థరాత్రి ప్రకటించిన జాబితాలో... అనూహ్యంగా.. తేజస్వి సూర్య పేరును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక తేజస్వీ సూర్య కర్ణాటక రాష్ట్ర బీజేపీ యువ మోర్చాకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన హిందువుల ప్రయోజనాల కోసం పోరాడతారనే ప్రచారం ఉంది. అంతేకాదు ప్రధాని మోదీ పట్ల అత్యంత విధేయత కనబరిచే వ్యక్తిగా పేరొందిన సూర్య... ఆయనపై విమర్శలు గుప్పించే వారికి గట్టిగానే సమాధానమిస్తారు. అదేవిధంగా బీజేపీ మీడియా మేనేజ్‌మెంట్ సెల్‌లో కూడా కీలకంగా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment