Bangalore South constituency
-
‘షాక్‌కు గురయ్యా.. అయినా నచ్చచెప్పుకొన్నా’
సాక్షి, బెంగళూరు : బీజేపీ అధిష్టానం బెంగళూరు సౌత్ లోక్‌సభ సీటును యువ న్యాయవాదికి కేటాయించడం తనను షాక్‌కు గురిచేసిందని తేజస్వినీ అనంతకుమార్ అన్నారు. యడ్యూరప్ప క్యాంపుతో సత్సంబంధాలు కలిగి ఉన్న 28 ఏళ్ల తేజస్వీ సూర్యను తమకు కంచుకోటగా ఉన్న బెంగళూరు సౌత్ స్థానం నుంచి బీజేపీ బరిలో దింపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ టికెట్‌ను ఆశించిన తేజస్వినీ అనంతకుమార్ మాట్లాడుతూ.. ‘ నాతో పాటు మా కార్యకర్తలను ఈ నిర్ణయం ఆశ్చర్యపరిచింది. ఇలాంటి సమయాల్లోనే పరిపక్వత కలిగిన వ్యక్తిగా ఆలోచించాలని నా మనసుకు నచ్చచెప్పుకొన్నా. పార్టీ ఆదేశాల్ని శిరసావహిస్తా. నా భర్త చాలా ఏళ్లపాటు పార్టీ కోసం పనిచేశారు. మాకెప్పుడూ జాతి ప్రయోజనాలే ముఖ్యం. ఆ తర్వాతే పార్టీ, స్వప్రయోజనాలు. ఆ విషయాన్ని నిరూపించుకునే సమయం ఇప్పుడు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో యక్ష ప్రశ్నలు వేసి సమయాన్ని వృథా చేయకండి. దేశానికి సేవ చేయాలని భావిస్తే నరేంద్ర మోదీజీ గెలుపు కోసం కృషి చేయండి’ అని ఆమె పిలుపునిచ్చారు. కాగా బెంగళూరు సౌత్ నుంచి 1996 నుంచి 2014 వరకూ బీజేపీ దివంగత నేత అనంతకుమార్ విజయబావుటా ఎగురువేశారు. ఆయన మరణంతో ఈ స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పార్టీ భారీ కసరత్తు చేసింది. ఈ క్రమంలో అనంత కుమార్ భార్య తేజస్విని పేరును రాష్ట్ర బీజేపీ వర్గం.. అధిష్టానానికి సిఫారసు చేసింది. అంతేకాదు ఒకానొక సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం అదే స్థానం నుంచి పోటీచేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అర్థరాత్రి ప్రకటించిన జాబితాలో... అనూహ్యంగా.. తేజస్వి సూర్య పేరును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తేజస్వీ సూర్య కర్ణాటక రాష్ట్ర బీజేపీ యువ మోర్చాకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన హిందువుల ప్రయోజనాల కోసం పోరాడతారనే ప్రచారం ఉంది. అంతేకాదు ప్రధాని మోదీ పట్ల అత్యంత విధేయత కనబరిచే వ్యక్తిగా పేరొందిన సూర్య... ఆయనపై విమర్శలు గుప్పించే వారికి గట్టిగానే సమాధానమిస్తారు. అదేవిధంగా బీజేపీ మీడియా మేనేజ్మెంట్ సెల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తారు. -
ఓమై గాడ్ నాకు ఎంపీ టికెటా..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సీనియర్, బలమైన నేతలను కాదని బెంగళూరు దక్షిణ లోక్‌సభ టికెట్‌ను 28ఏళ్ల యువ న్యాయవాదికి కేటాయించి ఆశ్చర్యపరిచింది. ఈ స్థానం నుంచి బీజేపీ దివంగత నేత, కేంద్ర మాజీమంత్రి అనంత కుమార్ సతీమణి తేజస్విణీని బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం భావించింది. ఐతే ఆఖరి నిమిషంలో ఆమెను కాదని కర్ణాటక హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న తేజస్వీ సూర్యను తెరపైకి తీసుకువచ్చింది. సూర్యను బెంగళూరు దక్షిణ స్థానానికి తమ అభ్యర్థిగా బీజేపీ ఎన్నికల కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రతిష్ఠాత్మక స్థానానికి తనను అభ్యర్థిగా ఎంపిక చేయడంపై తేజస్వీ షాక్‌కు గురయ్యారు. ‘‘ఓమై గాడ్ నాకు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చిందన్న వార్తను ఇంకా నమ్మలేకపోతున్నా’’అని సూర్య ట్విటర్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత బీకే హరిప్రసాద్‌పై తేజస్వీ పోటీపడనున్నారు. యువ నేతలకు అవకాశాలు ఇవ్వాలని, వారికి పార్టీలో సముచితస్థానం కల్పించాలని అభ్యర్థుల ఎంపికలో నిర్ణయించినట్లు ఒక బీజేపీ వర్గాలు తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి అనంత్ కుమార్ వరుసగా ఆరుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నేత నందన్ నీలేకనిపై అనంత్ కుమార్ గెలుపొందిన విషయం తెలిసిందే. I am humbled. Grateful. Overwhelmed. I thank PM @narendramodi for giving me this opportunity. I can't thank you enough, Modi Ji. I promise you that I shall work ceaselessly for our motherland till my last breath. That is the only way I can repay this debt of gratitude. THANK YOU! — Chowkidar Tejasvi Surya (@Tejasvi_Surya) March 25, 2019 -
ఓ మై గాడ్.. మోదీ ‘స్థానం’లో యువ లాయర్
బెంగళూరు : బీజేపీకి కంచుకోటైన దక్షిణ బెంగళూరుకు లోక్ సభ అభ్యర్థిగా ఎవర్ని నిలబెడతారన్న దానిపై నిన్నటి వరకూ సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఒకానొక దశలో ఆ స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ బెంగళూరు సౌత్ టికెట్‌ను యువ నాయకుడు, న్యాయవాది తేజస్వి సూర్యకు కేటాయిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తేజస్వి సూర్య ట్విటర్ ద్వారా వెల్లడించారు.(బెంగళూరు సౌత్ నుంచి మోదీ!) ‘ఓ మై గాడ్ నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని, ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అధ్యక్షుడు ఓ 28 ఏళ్ల యువకుడిని నమ్మి పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే బెంగళూరు సౌత్ టికెట్‌ను కేటాయించారు. ఇలాంటి వింతలు కేవలం బీజేపీలోనే జరుగుతాయ’ని ట్వీట్ చేశారు. మరో దాంట్లో తనకు దక్కిన ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తేజస్వి సూర్య తెలిపారు. ఈ అవకాశం కల్పించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. చివరి శ్వాస వరకూ దేశం కోసం శ్రమిస్తానంటూ మరో ట్వీట్ చేశారు. OMG OMG!!! I can't believe this. PM of world's largest democracy & President of largest political party have reposed faith in a 28 yr old guy to represent them in a constituency as prestigious as B'lore South. This can happen only in my BJP. Only in #NewIndia of @narendramodi — Chowkidar Tejasvi Surya (@Tejasvi_Surya) March 25, 2019 లాయరైన తేజస్వి సూర్య... రాష్ట్ర బీజేపీ యువ మోర్చాకు ఉపాధ్యక్షుడు. హిందువులకు అనుకూలంగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది. చాలా సందర్భాల్లో మోదీని వ్యతిరేకించే వారిని ఆయన తీవ్ర స్థాయిలో ఖండిస్తారు. బీజేపీ మీడియా మేనేజ్మెంట్ సెల్లో కీలకంగా వ్యవహరించే సూర్య... యడ్యూరప్ప క్యాంప్‌తో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా బీజేపీకి కంచుకోటగా మారిన బెంగళూరు సౌత్ నుంచి 1996 నుంచి 2014 వరకూ బెంగళూరు సౌత్‌లో గెలుస్తున్నది అనంత కుమారే. అయితే ఆయన మరణంతో బెంగళూరు సౌత్‌లో బలమైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషణ ప్రారంభించింది. ఒకానొక దశలో ఆయన భార్య తేజస్విని అనంత కుమార్ పేరునే రాష్ట్ర బీజేపీ.. ఢిల్లీ హైకమాండ్‌కి ప్రతిపాదించింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప సైతం ఆమెకే మద్దతు పలికారు. కానీ బీజేపీ అర్థరాత్రి ప్రకటించిన జాబితాలో... అనూహ్యంగా.. యువకుడైన తేజస్వి సూర్య పేరుంది. -
బెంగళూరు సౌత్ నుంచి మోదీ!
బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాదిపై కన్నేశారు. బీజేపీ ఉత్తరాదిన తన ప్రభంజనాన్ని కొనసాగిస్తుండగా.. దక్షిణాదిపై ఈ సారి పార్టీ అధష్టానం దృష్టిసారించింది. దీనిలో భాగంగానే నరేంద్ర మోదీ.. బెంగళూరు సౌత్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలోకి పార్టీ పెద్దలు ఈ విషయంపై కసరత్తులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. బీజేపీకి కంచుకోటగా మారిన బెంగళూరు సౌత్ నుంచి దివంగత మంత్రి అనంతకుమార్ 1996 నుంచి ఆరుసార్లు మంత్రిగా గెలుపొందారు. -
నందన్, బాలకృష్ణన్ ఢీ?
దేశంలోని ఐటీ దిగ్గజ కంపెనీలో ఒకప్పుడు వారిద్దరూ సహోద్యోగులు. ఉన్నత స్థానాల్లో ఉండగానే వారు సంస్థను వదిలారు. వారిద్దరూ ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులుగా మారనున్నారు. వారెవరో కాదు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో నందన్ నిలేకని, మాజీ సీఎఫ్ఓ వి. బాలకృష్ణన్. రానున్న లోక్‌సభలో ఎన్నికల్లో వీరిద్దరూ ముఖాముఖి పోటీ పడే అవకాశాలున్నాయని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ నుంచి బయటకు వచ్చిన బాలకృష్ణన్- ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. ఇన్ఫీ డెరైక్టర్ పదవిని వదులుకుని ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. 10 రూపాయల రుసుం చెల్లించి ఆప్ సభ్యత్వం తీసుకున్నారు. దేశంలో ఆప్ సృష్టించనున్న విప్లవంలో తాను భాగస్వామి కావాలన్న ఉద్దేశంతో పార్టీలో చేరినట్టు 48 ఏళ్ల బాలకృష్ణన్ వెల్లడించారు. అయితే ఇన్ఫోసిస్ ప్రస్తుత సీఈఓ, ఎండీ ఎస్డీ శిబులాల్ తర్వాత ఈ టాప్ పోస్టు రేసులో ముందంజలో ఉన్నట్లు చెబుతున్న బాలకృష్ణన్(‘బాల’ అని సుపరిచితం) హఠాత్తుగా గుడ్‌బై చెప్పడం అటు పరిశ్రమ వర్గాలతోపాటు, విశ్లేషకులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరోవైపు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ - ఆధార్ ప్రాజెక్టు) చైర్మన్ నందన్ నిలేకనిపై బాలకృష్ణన్‌ను ఆప్ పోటీ పెట్టే అవకాశముందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. దక్షిణ బెంగళూరు లోక్‌సభ స్థానం నుంచి నందన్‌ను పోటీకి దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనికి నిలేకని ఒప్పుకున్నారని కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర్ నిర్ధారించారు. అటు బాలకృషన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంతో నిలేకనిపై ఆప్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే నిలేకనిపై పోటీ చేసేందుకు తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరలేదని బాలకృష్ణన్ తెలిపారు. ఎన్నికల్లో ప్రచారం చేస్తానని నిలేకనికి మాట ఇచ్చానని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ విషయంపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని బాలకృష్ణన్ అభిప్రాయపడుతున్నారు. ఆప్‌లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో ఇంకా స్పష్టం కాలేదు. కేజ్రీవాల్‌ను కలిసిన తర్వాత పోటీపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఒకవేళ ప్రజాభిప్రాయం మేరకు కేజ్రీవాల్ ఆదేశిస్తే బాలకృష్ణన్ బరిలో దిగే అవకాశం లేకపోలేదు. ఐటీ దిగ్గజాల పోటీ సమాచారంతో ఇప్పటి నుంచే ఆసక్తి రేపుతోంది.