నందన్, బాలకృష్ణన్ ఢీ?
దేశంలోని ఐటీ దిగ్గజ కంపెనీలో ఒకప్పుడు వారిద్దరూ సహోద్యోగులు. ఉన్నత స్థానాల్లో ఉండగానే వారు సంస్థను వదిలారు. వారిద్దరూ ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులుగా మారనున్నారు. వారెవరో కాదు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో నందన్ నిలేకని, మాజీ సీఎఫ్ఓ వి. బాలకృష్ణన్. రానున్న లోక్సభలో ఎన్నికల్లో వీరిద్దరూ ముఖాముఖి పోటీ పడే అవకాశాలున్నాయని ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
తాజాగా ఇన్ఫోసిస్ నుంచి బయటకు వచ్చిన బాలకృష్ణన్- ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. ఇన్ఫీ డెరైక్టర్ పదవిని వదులుకుని ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. 10 రూపాయల రుసుం చెల్లించి ఆప్ సభ్యత్వం తీసుకున్నారు. దేశంలో ఆప్ సృష్టించనున్న విప్లవంలో తాను భాగస్వామి కావాలన్న ఉద్దేశంతో పార్టీలో చేరినట్టు 48 ఏళ్ల బాలకృష్ణన్ వెల్లడించారు. అయితే ఇన్ఫోసిస్ ప్రస్తుత సీఈఓ, ఎండీ ఎస్‌డీ శిబులాల్ తర్వాత ఈ టాప్ పోస్టు రేసులో ముందంజలో ఉన్నట్లు చెబుతున్న బాలకృష్ణన్(‘బాల’ అని సుపరిచితం) హఠాత్తుగా గుడ్‌బై చెప్పడం అటు పరిశ్రమ వర్గాలతోపాటు, విశ్లేషకులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
మరోవైపు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ - ఆధార్ ప్రాజెక్టు) చైర్మన్ నందన్ నిలేకనిపై బాలకృష్ణన్ను ఆప్ పోటీ పెట్టే అవకాశముందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. దక్షిణ బెంగళూరు లోక్సభ స్థానం నుంచి నందన్ను పోటీకి దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనికి నిలేకని ఒప్పుకున్నారని కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర్ నిర్ధారించారు. అటు బాలకృషన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంతో నిలేకనిపై ఆప్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతారన్న ప్రచారం ఊపందుకుంది.
అయితే నిలేకనిపై పోటీ చేసేందుకు తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరలేదని బాలకృష్ణన్ తెలిపారు. ఎన్నికల్లో ప్రచారం చేస్తానని నిలేకనికి మాట ఇచ్చానని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ విషయంపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని బాలకృష్ణన్ అభిప్రాయపడుతున్నారు. ఆప్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో ఇంకా స్పష్టం కాలేదు. కేజ్రీవాల్ను కలిసిన తర్వాత పోటీపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఒకవేళ ప్రజాభిప్రాయం మేరకు కేజ్రీవాల్ ఆదేశిస్తే బాలకృష్ణన్ బరిలో దిగే అవకాశం లేకపోలేదు. ఐటీ దిగ్గజాల పోటీ సమాచారంతో ఇప్పటి నుంచే ఆసక్తి రేపుతోంది.