మంగళవారం అర్థరాత్రి పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన తెలుపుతున్న మహిళలు
తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఫేస్‌బుక్ పోస్టింగ్ వివాదస్పదమైంది. ఎమ్మెల్యే, జెడ్పీటీసీ అనుచరుల మధ్య యుద్ధం మొదలైంది. చివరకు పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం...దానికి వ్యతిరేకంగా పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించడం ఒకదాని తరువాత ఒకటి వరుస పరిణామాలు మంగళవారం రాత్రి టీడీపీ శ్రేణుల్లో అంతర్గతంగా ఉన్న విబేధాలను బయటపెట్టాయి. వివరాల్లోకి వెళ్తే...
చీపురుపల్లి: జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు అనుచరుడు కంచుపల్లి రమేష్ అలియాస్ అశోక్ ఎమ్మెల్యే కిమిడి మృణాళినిక క్యాంపు కార్యాలయంపై అసభ్యకరమైన పదజాలంతో ఫేస్‌బుక్ పోస్టింగ్ చేశాడంటూ పోలీసు శాఖ సుమోటోగా దాన్ని భావించి పోస్టు చేసిన అశోక్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకొంది. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ వర్గీయులు, మహిళలు పెద్ద ఎత్తున అర్ధరాత్రి పోలీస్‌స్షేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. న్యాయవాది పూచీకత్తుపై అర్ధరాత్రి 12 తరువాత విడుదల చేసిన పోలీసులు బుధవారం ఉదయం స్టేషన్‌కు రావాలని ఎస్‌ఐ కాంతికుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం అశోక్‌తో సహా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన అశోక్‌తో పాటు జెడ్పీటీసీ వరహాలనాయుడు వర్గీయులు ఎమ్మెల్యే మృణాళిని కార్యాలయంలో పని చేసే ఉద్యోగి బొత్స గోపీనాధ్, ఆర్‌ఈసీఎస్ చైర్మన్ కారు డ్రైవర్ గవిడి శ్రీనివాసరావు, పిన్నింటి వివేక్, రాకేష్, రామ్స్‌లపై ఫిర్యాదు చేశారు.ఆ ఐదుగురు తనను సహనం కొల్పోయేలా ప్రేరేపించారని, భయపెడుతున్నారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో
పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం మరింత వివాదస్పదమైంది.
హార్ట్ పేషెంట్ అని చెప్పినా....
ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ వివాదాన్ని ఎదుర్కొంటున్న కంచుపల్లి రమేష్ అలియాస్ అశోక్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనపై ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా స్టేషన్‌కు తీసుకొచ్చి కొట్టారని ఆరోపించాడు. తాను హార్ట్ పేషెంట్‌నని చెప్పినా ఎస్‌ఐ వినిపించుకోలేదన్నారు. ఫేస్‌బుక్‌లో తాను ఎమ్మెల్యేను ఉద్దేశించి పోస్టింగ్‌లు పెట్టలేదని చెప్పాడు. ఐదుగురు యువకులు తనను హింసిస్తున్నారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మెసేజ్‌లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు...
ఫేస్‌బుక్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై అసభ్యకరమైన పదజాలంతో పోస్టింగ్‌లు పెట్టినందుకు కంచుపల్లి రమేష్ అలియాస్ అశోక్‌ను ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు చె ప్పారు. ఫేస్‌బుక్‌లో అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెడితే ఫిర్యాదు లేకపోయినా చర్యలు ఉంటాయన్నారు. ఆ పోస్టింగ్‌లు తానే పెట్టినట్లు అశోక్ అంగీకరించినట్లు చెప్పారు. మంగళవారం అశోక్ ఇచ్చిన ఫిర్యాదులో నేరం పట్టదగ్గ అంశాలు లేనందున విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment