
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్‌కు ఇంకా అధికారికంగా స్వాతంత్య్రం రాకముందు అంటే, 1946లో ప్రభుత్వంలో నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ముందుకు రాగా, 16 మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్లో ఒక్కరు మాత్రమే ఆయనకు అనుకూలంగా ఓటేశారు. మిగతా 15 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఓటేశారు. పోటీ నుంచి తప్పుకోవాలంటూ జాతిపిత మహాత్మా గాంధీ చేసిన విజ్ఞప్తి మేరకు పటేల్ తప్పుకున్నారు. పదవి పండిట్‌ను వరించింది’ ఇంటర్నెట్‌లో విస్తతంగా ప్రచారంలో ఉన్న కథ ఇది. ఈ కథను మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా నమ్మారు. సర్దార్ పటేల్ దేశానికి తొలి ప్రధాన మంత్రి కావాల్సిన వారని, అందుకు ఆయన్ని అడ్డుకున్నారని, లేకపోతే పటేల్, నెహ్రూకన్నా సమర్థుడైన ప్రధాని అయ్యేవారని మోదీ వ్యాఖ్యానాలు కూడా చేశారు. గతేడాది పటేల్ వర్ధంతి సందర్భంగానే కాకుండా ఈ అక్టోబర్ 31వ తేదీన జరిగిన జయంతి సందర్భంగా కూడా ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మోదీ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే మన ప్రధాన మంత్రిగా ఆయన్ని దేశ ప్రజలు కాకుండా రాష్ట్ర బీజేపీ శాఖలన్నీ కలిసి ఎన్నుకున్నట్లుగా ఉంది. అసలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కలిసి దేశ ప్రధానిని ఎన్నుకోవడం ఏమిటీ? ఇంకా కావాలనుకుంటే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించవచ్చు. అలా అనుకున్నాగానీ నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులే ఎన్నుకునేవారు. నెహ్రూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంతకన్నా కాదు. అప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిగా జీబీ కృపలాని ఎన్నికయ్యారు. మరి 1946లో జరిగిందేమిటీ?
బ్రిటీష్ వైస్రాయ్ ఎన్నుకున్నారు
గాంధీ తర్వాత అంతటి ప్రజాదరణ కలిగిన పండిట్ నెహ్రూ నాయకత్వాన అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1947, ఆగస్టు 15 వ తేదీన దేశ ప్రధాన మంత్రిగా నెహ్రూ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నాడు పటేల్ కన్నా నెహ్రూకే ఎక్కువ ప్రజాదరణ ఉందనడానికి పటేల్ అమెరికా జర్నలిస్ట్ విన్సెంట్ షీన్‌తో చేసిన వ్యాఖ్యలే సాక్ష్యం. ముంబైలో జరిగిన కాంగ్రెస్ మహా సమ్మేళనానికి లక్షలాది మంది ప్రజలు హాజరుకావడాన్ని అమెరికా జర్నలిస్ట్ ప్రశ్నించినప్పుడు ‘వీరంతా నా కోసం రాలేదు. నేను మాస్ లీడర్‌ను కాను. నెహ్రూగారి కోసం వచ్చారు’ అని వ్యాఖ్యానించారు.
పటేల్ మొదటి నుంచి కాంగ్రెస్ వాదే
‘నాడు వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉక్కులాంటి బలమైన సంకల్పం కలిగిన సర్దార్ పటేల్ లాంటి వ్యక్తులు ఆరోజుల్లో మాకుండడం మా అదృష్టం’ అని 1966లో ఆరెస్సెస్ సుప్రీం ఎంఎస్ గోవాల్కర్ ‘బంచ్ ఆఫ్ థాట్స్’ అనే పుస్తకంలో రాశారు. ఆయన ఈ వ్యాక్యం ఏ ఉద్దేశంతో రాశారో తెలియదుగానీ గోవాల్కర్‌ను గురువుగా భావించే నరేంద్ర మోదీ కూడా ఆయన మాటల్ని నమ్మారు. ఆరెస్సెస్ సిద్ధాంతం పటేల్‌కు నచ్చిందని భావించి పటేల్ భజన ప్రారంభించారు. ఆరెస్సెస్ వారిని దారితప్పిన దేశభక్తులుగా భావించిన పటేల్, గాంధీ హత్యకు సరిగ్గా మూడు వారాల ముందే వారిని కాంగ్రెస్ పార్టీలోకి కూడా ఆహ్వానించారు. అయితే జాతిపిత గాంధీ హత్యానంతరం డిప్యూటి ప్రధాన మంత్రి హోదాలో హోం శాఖను నిర్వహిస్తున్న పటేల్ ఆరెస్సెస్ నిషేధించారు. ఆరెస్సెస్ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ 1948, జూలై 18న భవిష్యత్ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద ముఖర్జీకి లేఖ కూడా రాశారు.
‘హిందూ మహాసభకు చెందిన తీవ్రభావాజాలం కలిగిన వ్యక్తులే గాంధీ హత్యకు కుట్రదారులని నేను భావిస్తున్నాను. ఆరెస్సెస్ కార్యకలాపాలు ప్రభుత్వం, రాజ్యం మనుగడకు ప్రమాదకరంగా తయారయ్యాయి’ అని సర్దార్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎప్పటికీ రామన్న హామీపై ఆరెస్సెస్‌పై ఏడాదిన్నర తర్వాత ఆయన నిషేధాన్ని ఎత్తివేశారు. ఏడాది తిరక్కముందే ఆరెస్సెస్ ఈ హామీని తుంగలో తొక్కింది. రాజకీయాల్లో పాల్గొనేందుకు జనసంఘ్‌ను తీసుకొచ్చింది. నాటి జనసంఘ్‌యే నేటి బీజేపీ. పటేల్ చనిపోయే వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారు.
దేశ విభజనను అంగీకరించిందే పటేల్
దేశ విభజనను పండిట్ నెహ్రూ కోరుకోవడం వల్లనే పాకిస్థాన్ ఏర్పడిందని, అందుకని ఆయన్ని చంపాలనుకున్న నాథూరామ్ గాడ్సే ఆయనకు బదులుగా గాంధీని హత్య చేశారంటూ కేరళ ఆరెస్సెస్ పత్రిక ఇటీవల సరికొత్త కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. పటేల్ దేశ విభజనను వ్యతిరేకించారని కూడా పేర్కొంది. గోవాల్కర్ వ్యాఖ్యలను నమ్మినట్లే మన మోదీ కేరళ ఆరెస్సెస్ వ్యాఖ్యలను నమ్మారు. ఆయన దేశం ఐక్యత కోసం కషి చేశారంటూ నిన్నటి ప్రసంగానికి మెరుగులు దిద్దారు. 1946, డిసెంబర్‌లోనే పటేల్ దేశ విభజనకు అంగీకరించారు. ఆయన వైఖరి పట్ల మొదటి నుంచి దేశ విభజనను వ్యతిరేకించిన అబుల్ కలాం ఆజాద్ బాధను వ్యక్తం చేశారు. తాను రాసిన లేఖకు ‘మనం అంగీకరించినా, లేకపోయినా భారత్‌లో రెండు దేశాలు ఉన్నాయి’ అంటూ పటేల్ సమాధానం ఇవ్వడం పట్ల ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్’ పేరిట తాను రాసిన జ్ఞాపకాల్లో అబుల్ కలాం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆరు నెలలకు నెహ్రూ దేశ విభజనకు అంగీకరించారు. దాంతో వీపీ మీనన్ నాయకత్వాన దేశ విభజన ప్రణాళిక రూపొందింది.
బాబ్రీ మసీదును ధ్వంసం చేయాలనలేదు
1949లో కొంతమంది బృందం బాబ్రీ మసీదులోకి జొరబడి అక్కడ రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో కొంత గొడవ జరిగింది. ఆ తర్వాత నెల రోజులకు ఈ అంశంపై అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జీబీ పంత్‌కు పటేల్ ఓ హెచ్చరిక లేఖ రాశారు. ‘ఇలాంటి సమస్యలను బలప్రయోగం ద్వారా పరిష్కరించుకునే ప్రసక్తే లేదు. ఏదైనా ముస్లింలను కూడా విశ్వాసంలోకి తీసుకొని సామరస్యంగా, శాంతియుతంగా పరిష్కరించుకోవడం మంచిది’ అన్నారు. దీనికి ఆరెస్సెస్ శక్తులు ఆనాడే బాబ్రీ విధ్వంసానికి పటేల్ ఒప్పుకున్నారని ఎక్కడలేని ప్రచారం చేస్తోంది. ఇలాంటి ప్రచారాలన్నీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టితోనేనని, 14 శాతమున్న పటేళ్లను మెప్పించడం కోసమే పటేల్ గురించి మాట్లాడుతున్నారని ఎవరైనా గ్రహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment