సాక్షి, ముంబై: ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో ప్రభుత్వ నివాస గృహమైన వర్షాబంగ్లాలో ఇదివరకు నివాసమున్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఖాళీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ సమేతంగా వర్షా బంగ్లాలోకి నివాసముండేందుకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో వర్షా బంగ్లాను సాధ్యమైనంత త్వరగా ఫడ్నవిస్‌కు ఖాళీ చేయక తప్పడం లేదు. సుమారు 12 సిబ్బంది సామాగ్రి ప్యాకింగ్ చేయడంలో నిమగ్నమయ్యారు. సామాగ్రి తరలించేందుకు ట్రక్కులు, కంటైనర్లు, టెంపోలు తదితర వాహనాలను వర్షా బంగ్లా ఆవరణలో సిద్ధంగా ఉన్నాయి.
చదవండి: నేడు ఠాక్రే విశ్వాస పరీక్ష
అందులో సామగ్రి సర్దుబాటు చేసి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యక్తిగత నివాసానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రే వర్షాబంగ్లాకు మారుతారా? లేక తనకు సెంటిమెంట్‌గా ఉన్న మాతోశ్రీ బంగ్లా నుంచి పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తారా? అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన వారు నియమాల ప్రకారం వర్షా బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బంగ్లాను మళ్లీ కొత్తగా ముస్తాబు చేస్తారు. నూతన ముఖ్యమంత్రికి అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దుతారు. ఫర్నిచర్, కిటికీ, డోరు కర్టెన్లు, హాలు, గదుల రంగులు, అలంకరణ తదితర పనులు పూర్తిచేస్తారు. అందుకు కొంత సమయం పడుతుంది. దీంతో ఫడ్నవిస్ ఖాళీ చేయగానే నవీకరణ పనులు ప్రారంభిస్తారని ఓ అధికారి చెప్పారు.
మారిన పరిస్థితులు..
ఇక రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. దీంతో ఇదివరకు బీజేపీ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు నివాసముంటున్న క్వార్టర్స్, బంగ్లాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మరో మూడు నెలలు వర్షా బంగ్లాలోనే ఉంటారని ఆ సమయంలో పేర్కొన్నారు. అందుకు పీడబ్ల్యూడీ కూడా గడువు పెంచింది. కానీ ఈ నెల 23న ఊహించని విధంగా పరిస్థితులు మారిపోయాయి. రాత్రికి రాత్రే రాష్ట్రపతి పాలన ఎత్తేయటం.. సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌పవార్ ప్రమాణ స్వీకారం చేయటం ఉత్కంఠ రేపాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ప్రతిపక్షాలు అవాక్కయ్యాయి. చివరకు విపక్షాలు కోర్టును ఆశ్రయించడం, తగినంత మెజారిటీ లేకపోవడం, అజిత్‌పవార్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం అన్ని జరిగిపోయాయి. చివరకు ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 90 గంటల్లోనే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.
ముంబైలోనే ఫడ్నవిస్ నివాసం..
మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మలబార్ హిల్‌లోని ప్రభుత్వ నివాస గృహమైన వర్షా బంగ్లాను ఖాళీ చేసిన తర్వాత ఆయన ముంబైలోనే ఉంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దక్షిణ–పశ్చిమ నాగ్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి గెలిచిన ఫడ్నవిస్‌పై బీజేపీ అధిష్టానం ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆయన ముంబైలోనే ఉండాల్సి ఉంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడికి ముంబైలో ప్రభుత్వ బంగ్లా లభించనుంది. అంతేగాకుండా దేవేంద్ర సతీమణి అమృత ఫడ్నవిస్ ముంబై, యాక్సిస్ బ్యాంకులో సీనియర్ అధికారి పదవిలో కొనసాగుతున్నారు. అలాగే ఆమె కూతురు కూడా ముంబైలో విద్యాభ్యాసం చేస్తోంది. దీంతో వర్షా బంగ్లా ఖాళీ చేసినప్పటికీ ఫడ్నవిస్ కుటుంబానికి ముంబైలోనే ఉండాల్సి రానుంది. దీంతో ఆయన కుటుంబం కోసం ముంబైలోనే ఇల్లు కోసం గాలించడం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment