
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం తానే అవుతానన్న ధీమాతో మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి భవిష్యత్ రాజకీయ వ్యూహ రచనలో మునిగిపోయారు. సుదీర్ఘ కాలం తాను ఎమ్మెల్యేగా పనిచేసిన నాగార్జునసాగర్ (అంతకుముందు చలకుర్తి) నియోజకవర్గంలో తన కుమారుడు రఘువీర్‌రెడ్డిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ముందు నుంచి తనకు పట్టున్న మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేయాలని జానారెడ్డి నిర్ణయించుకున్నారని, ఇందుకు పార్టీ అధిష్టానం కూడా అనుమతి ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. తాను మిర్యాలగూడ నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారు కావడంతో, సాగర్ నుంచి రఘువీర్‌ను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జానారెడ్డి నియోజకవర్గం మారితే.. తమకేమన్నా అవకాశం దక్కుతుందేమోనని ఎదురుచూస్తున్న కొందరు ఆశావహులకు నిరాశే కలగనుంది.
సీఎం అభ్యర్థిగా ప్రచారం..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని, ఆ మేరకు నియోజకవర్గంలో సీఎం అభ్యర్థిగానే ప్రచారం చేయాలన్న వ్యూహంతో జానారెడ్డి ఉన్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాను సీఎం పదవిని దక్కించుకోలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగాలన్న యోచనలో కూడా ఉన్నారని వారు వివరిస్తున్నారు.
ఈసారి ఓడినా, గెలిచినా తనకంటూ ఒక నియోజకవర్గం ఉండే విధంగానే రఘువీర్‌కు సాగర్‌ను వదిలి జానారెడ్డి మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. 1983 నుంచి జానారెడ్డికి తిరుగులేని కోటగా ఉన్న నాగార్జునసాగర్‌లో కుమారుడిని గెలిపించుకోవడం కష్టం కాదని భావిస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.భాస్కర్‌రావు గెలిచారు. ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడం తో జానారెడ్డి ఈ స్థానాన్ని ఎంచుకున్నారని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment