ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీజేపీ నాయకలు
సాక్షి, కడప : అధికారం ఎక్కడ ఉంటే మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి అక్కడే ఉంటారన్న ప్రచారం మరోసారి నిజమైంది. ఆయన సోమవారం ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ జాతీయ నాయకుల చేతుల మీదుగా ఆది ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే ఆది బీజేపీలో చేరుతారన్న ప్రచారం సాగినా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అడ్డుకోవడంతో ఆలస్యమైంది. నైతిక విలువలను ఏమాత్రం పట్టించుకోరని ఆది రా జకీయ శైలి చెబుతుంది. దివంగత నేత వైఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఆయనవద్దే ఉన్నారు. తరువాత టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన వైఎస్ జగన్‌ను కాదని చంద్రబాబు పంచన చేరారు. అధికారం పోయాక ఇప్పుడు బాబును వదిలేశారు. జగన్ పార్టీ ఎలాగూ పార్టీలో చేర్చుకోరని తెలియడంతో బీజేపీలో చేరిపోయారు.
ఆలస్యం..
టీడీపీలో చేరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతతోపాటు ఆ పార్టీ నేతలపై అవాకులు చెవాకులు పేలారు. అవికాస్తా వికటించాయి. జమ్మల మడుగుతోపాటు కడప పార్లమెంటరీ ఓటర్లు గట్టిగా సమాధానం చెప్పారు. కొంతకాలంగా టీడీపీ అధినేత సూచనలతో బీజేపీలో చేరేందుకు మాజీ మంత్రి సిద్ధమయ్యారు. అయితే పరిణామాలు అనుకూలించలేదు. వివిధ చర్చల నేపథ్యంలో ఎట్టకేలకు ఆలస్యంగా బీజేపీలో చేరగలిగారు. అనుచరగణమెవరూ బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరు. ముఖ్య అనుచరులు, సమీప బంధువులుకూడా ఆయనతో కలిసి నడిచేందుకు ఇష్టపడడంలేదు. అధికారం లేకపోతే ఆయన ఉండలేరని ఆయన ధోరణి తెలిసినవారంతా చెబుతారు. ఫ్యాక్షన్ రాజకీయాలను నడిపేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్వార్ధం కోసం కింద క్యాడర్ ఏమైపోయినా పట్టించుకోరు. ఇప్పుడు ఆది మరోమారు తన సహజ రాజకీయ స్వభావాన్ని చాటుకున్నారు.
దివంగత నేత వైఎస్ అనుచరుడిగా 2004,2009లో జమ్మలమడుగునుండి ఎన్నికయ్యారు. తరువాత జగన్‌మోహన్‌రెడ్డి టీంలో 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ కుటుంబానికి జమ్మల మడుగు నియోజకవర్గంతో బలమైన అనుబంధం ఉంది. గెలుపోటములు నిర్దేశించేది వైఎస్ కుటుంబ అభిమానులే. గెలిచాక పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జనం ఆయనకు గుణపాటం నేర్పారు. జమ్మలమడుగులో ఆయన బలపర్చిన సుబ్బారెడ్డిని ఓడించారు. కడప ఎంపీగా పోటీచేసి పరాజయం మూటగట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ దగ్గరకు రానిచ్చే అవకాశం లేకపోవడంతో టీడీపీ షెల్టర్ జోన్‌గా సెలక్ట్ చేసిన బీజేపీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మనుగడకోసం తంటాలు పడుతున్న టీడీపీ నేతలకు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారింది. చంద్రబాబే కీలక నేతలందరినీ బీజేపీలోకి పంపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఇదే పంథాలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి వంతయింది. ఇన్నాళ్లు పార్టీలో అన్నిరకాల పదవులు అనుభవించి నేతలు పార్టీని వీడి వెళుతున్నా టీడీపీ నేతలెవరూ విమర్శిస్తున్న దాఖలాలు లేవు. దీన్నిబట్టి మ్యాచ్ పిక్సింగ్ వ్యవహారం ఇప్పుడు జనంలో హాట్ టాపిక్ గా మారింది.
బాబు మ్యాచ్ పిక్సింగ్
Comments
Please login to add a commentAdd a comment