
మాజీ ఎమ్మెల్యే కామ్రెడ్ గుర్రం యాదగిరిరెడ్డి
వామపక్ష ఉద్యమ ధీరుడు, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి అస్తమించారు. మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన నాటి రామన్నపేట నియోజకవర్గంనుంచి మూడు పర్యాయాలు (1985, 1989, 1994) శాసనసభ్యుడిగా పనిచేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో అమలు చేసిన క్రాంతిపథకం నుంచి అనేకమంది రైతులకు బోర్లు వేయించడంతో ఇక్కడి రైతులు ఆయనను నేటికీ గుర్తించుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివించి ఆదర్శంగా నిలిచారు. శనివారం ఆయన స్వగ్రామం గుండాల మండలం సుద్దాలలో అంత్యక్రియలు జరగనున్నాయి.
ధర్మభిక్షంతో యాదగిరిరెడ్డి (ఫైల్)
సాక్షి, ఆలేరు(నల్గొండ) : నీతి, నిజాయితీకి పెట్టింది పేరైన, ఆదర్శ జీవితానికి నిలువుటద్దమైన, అలుపెరుగని పోరాటయోధుడు, రామన్నపేట మాజీ ఎమ్మెల్యే కామ్రెడ్ గుర్రం యాదగిరిరెడ్డి శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సొంత ఇల్లు లేని ఎర్ర సూర్యుడు అస్తమించాడు. ప్రజల కోసం నిరంతరం పని చేసి స్వచ్ఛందంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈయన రామన్నపేట నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994లో రాజకీయ ఉద్దండుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిపై మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
కుటుంబ నేపథ్యం...
సుద్దాల గ్రామంలో గుర్రం నర్సమ్మ, రాంరెడ్డి చివరి సంతానం యాదగిరిరెడ్డి. ఈయనకు అన్నతో పాటు ఐదుగురు అక్కలు ఉన్నారు. 05.02.1931న సుద్దాల గ్రామంలో జన్మించారు. రాత్రి బడిలో 5వ తరగతి వరకు భోగం యాదగిరి పంతులు వద్ద చదువుకున్నారు. గొర్రెల కాపరిగా, వ్యవసాయం చేస్తూ జీవనం సాగిం చారు. గుతుప సంఘానికి 15 ఏళ్ల వయస్సులోనే పాలు అందిస్తూ దళంలోకి వెళ్లారు. ఆయనకు తల్లిదండ్రులు వారసత్వంగా ఇచ్చిన మూడెకరాల భూమితో పాటు పాత పెంకుటింట్లోనే జీవనం సాగించారు. ఆయనకు భార్య యాదమ్మ (రామాంజమ్మ)తో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడైన గుర్రం రాజశేఖరరెడ్డి న్యాయవాదిగా, చిన్న కుమారుడు రాంమోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో విశాలాంధ్ర దిన పత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. పెద్ద కుమార్తెను మోటకొండూర్ మండలం తేర్యాల గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తికి వచ్చి పెళ్లి చేశాడు.
కుటుంబసభ్యులతో యాదగిరిరెడ్డి (ఫైల్)
చిన్న కుమార్తె హైదరాబాద్‌లో జీవనం సాగిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా దళంలో పని చేశారు. నిర్మలా కృష్ణమూర్తి, నల్ల నర్సింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి దళాల్లో పని చేసి దళ కమాండర్‌గా ఎదిగారు. సుద్దాల హన్మంతుతో పాటు నాయిని నర్సింహారెడ్డి, దూదిపాల చిన్న సత్తిరెడ్డి, కూరెళ్ల సంజీవరెడ్డితో కలిసి దళంలో పని చేశారు. పాటలు పాడటం, బుర్ర కథలు చెప్పడంలో ఈయన దిట్ట. మండలంలోని వివిధ గ్రామాలకు తన హయాంలో మెటల్ రోడ్లు వేయించిన ఘనత ఆయనకే దక్కింది. మాజీ ఎమ్మెల్యే మృతికి ఎంపీపీ తాండ్ర అమరావతి, జెడ్పీటీసీ కోలుకొండ లక్ష్మి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఎండీ. ఖలీల్‌తో పాటు అఖిలపక్ష నాయకులు అండెం సంజీవరెడ్డి, ద్యాప కృష్ణారెడ్డి, మందడి రామకృష్ణారెడ్డి, గార్లపాటి సోమిరెడ్డి, దాసరి మల్లేషం, నాగార్జున్‌రెడ్డి, బయ్యని చంద్రశేఖర్, మరాటి బీరప్ప, గడ్డమీది పాండరి, కె.హరిశ్చంద్ర, ఆదిసాయిలు, మద్దెపురం రాజు, బండారు వెంకటేష్, బడక మల్లయ్యతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
యాదగిరిరెడ్డి మరణం తీరని లోటు
సాక్షి, యాదాద్రి : రామన్నపేట నియోజకవర్గం నుంచి పలుమార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై నియోజకవర్గ అభివృద్ధితోపాటు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పని చేసిన గుర్రం యాదగిరిరెడ్డి మరణం ఎంతో లోటు అని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రాజమౌళిచౌరి శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
సీపీఐ నాయకుల నివాళి
ఆలేరు : సీపీఐ సీనియర్ నాయకులు, తెలంగాణ పోరాటయోధుడు, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి మృతికి సీపీఐ జిల్లా, ఆలేరు మండల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, డివిజన్ కార్యదర్శి అయిలి సత్తయ్య, కొల్లూరు రాజయ్య దివంగత యాదగిరిరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అలాగే సీసీఐ ఆలేరు మండల సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాదగిరిరెడ్డి చిత్రపటం వద్ద సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చెక్క వెంకటేష్, మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, నాయకులు గొట్టిపాముల రాజు, పరుశురాములు, సోమలింగం, అంజయ్య తదితరులు నివాళులర్పించారు.
సీపీఐ మహాసభల్లో పాల్గొన్న యాదగిరిరెడ్డి
అజాత శత్రువు యాదగిరిరెడ్డి
రామన్నపేట : వామపక్ష ఉద్యమ కెరటం, రామన్నపేట మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి నిరాండబరుడు, అజాతశత్రు వు. ఓటమెరుగని ధీరుడు. రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. గుర్రం యాదగిరిరెడ్డి 1985, 1989, 1994లో మూడు పర్యాయాలు రామన్నపేట అసెంబ్లీస్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి హ్యాట్రిక్ సాధించారు. 1999లో ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. గెలిచిన మూడు సార్లు కూడా మాజీ మంత్రి, కాంగ్రెస్‌పార్టీ రాజకీయ ఉద్దండుడు, దివంగతనేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిపైనే కావడం గమనార్హం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేశారు. గ్రామాలకు రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యంను కల్పించడంతోపాటు పాఠశాలల, ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు విశేషమైన కృషిచేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో అమలు చేసిన క్రాంతిపథకం నుంచి అనేకమంది రైతులకు ఇన్‌వెల్ బోర్లు వేయించడం ద్వారా వారిని ఆదుకున్నారు.
యాదగిరిరెడ్డి మృతి బాధాకరం మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట : సీనియర్ కమ్యూనిస్టు నేత, మాజీ శాసనసభ్యుడు గుర్రం యాదగిరిరెడ్డి మృతి ఉమ్మ డి నల్లగొండ జిల్లా రాజకీయాలకు తీరనిలోటని, ఎంతో బాధాకరమని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిరెడ్డి మరణించారన్న విషయం తెలుసుకున్న మంత్రి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జిల్లా రాజకీయాల్లో ఆయన పాత్ర శాశ్వతంగా నిలిచిపోతుందని కొనియాడారు.

సుద్దాల గ్రామంలో యాదగిరిరెడ్డి ఇల్లు
Comments
Please login to add a commentAdd a comment