సాక్షి, తూర్పు గోదావరి: తెలుగుదేశం పార్టీలో హర్షకుమార్ ముచ్చటగా అయిదు రోజులే... అమలాపురం మాజీ ఎంపీగా పని చేసిన హర్షకుమార్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ఇటీవలే చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిలెక్కారు. పార్టీలో చేరిక సందర్భంగా ఆయన...చంద్రబాబు నాయుడు కాళ్లు మొక్కడం హాట్ టాఫిక్‌గా మారింది. అయితే టికెట్ విషయంలో భంగపడిన హర్షకుమార్ తీవ్ర నిరాశకు గురై... కేవలం అయిదు రోజుల్లో ఆయన సైకిల్ ముచ్చట తీర్చేసుకున్నారు. హర్షకుమార్ చేరిక జిల్లాలో కలిసి వస్తుందనుకున్న టీడీపీకి ఆయన షాక్ ఇస్తూ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ ఆశించిన హర్షకుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసింది. అయితే టీడీపీ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో హర్షకుమార్ అసంతృప్తికి లోనయ్యారు. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు రెండు ఒక్కటేనని ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే టీడీపీతో పొత్తు లేదని దేవుడిపై ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ, టికెట్లను టీడీపీ ఫిక్స్ చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. తన అనుచరులకు మాత్రం నచ్చిన పార్టీకి ఓటు వేసుకోండని ఆయన పిలుపునిచ్చారు.
అయితే ఇటీవల టీడీపీలో చేరిన సమయంలో హర్షకుమార్, చంద్రబాబు కాలు పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై హర్షకుమార్ అభిమానులు, దళితులు, ప్రజా సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీటు కోసం ఇంతగా దిగజారాలా అని పెదవి విరిచారు. నెటిజన్లయితే హర్షకుమార్ తీరుపై పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment