సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినదించని వాళ్లకు టీఆర్‌ఎస్ లోక్‌సభ టికెట్లు ఇచ్చారని పెద్దపల్లి మాజీ లోక్‌సభ సభ్యుడు జి. వివేకానంద ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా ఉద్యమకారులను పక్కనబెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణకు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లే ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు పెద్ద ముఖాలుగా ఉండటం బాధిస్తోందని వ్యాఖ్యానించారు. పెద్దపల్లి ప్రజలకు తనను దూరం చేయడానికి టీఆర్‌ఎస్ చేసిన ద్రోహం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటం వల్ల ఈసారి పోటీ చేయలేకపోతున్నానన్నారు. ఈ మేరకు వివేకానంద సోమవారం హైదరాబాద్‌లో పత్రికా ప్రకటన విడుదల చేశారు.
కేసీఆర్ తొత్తుల పనే...
‘ఒక పథకం ప్రకారం నేను పోటీ చేసే అవకాశం లేకుండా కేసీఆర్ చివరి క్షణంలో టికెట్ నిరాకరించారు. ఇప్పుడు ఆయన ఆటబొమ్మలు కొందరు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తికి లోక్‌సభ టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో తేలిపోయింది. నా తండ్రి కాకా, నేను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశాం. తెలంగాణ మేలు కోసం కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్‌ఎస్‌లోకి వచ్చాను. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా తెలంగాణ కోసం పనిచేయడం, పోరాడటం పార్టీకి ద్రోహం చేయడమా? టీఆర్‌ఎస్ బలహీనంగా ఉన్నచోట పార్టీ పటిష్టత కోసం పనిచేయడమే నేను చేసిన ద్రోహమా? 2014లో టీఆర్‌ఎస్‌కు ఇద్దరు ఎంపీలే ఉంటే... తోటి ఎంపీలతో కలిసి తెలంగాణ బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడం నేను చేసిన ద్రోహమా? తెలంగాణ సాధనలో కాకా సేవలకు గుర్తింపుగానే ట్యాంక్ బండ్‌పై విగ్రహం పెట్టారు. టికెట్ హామీ ఇచ్చి కూడా నన్ను పెద్దపల్లికి దూరంగా పెట్టడానికి కేసీఆర్ తొత్తులు కొందరు పనిచేశారు.
ప్రభుత్వ సలహాదారుగా ప్రయోజనాలేవీ తీసుకోలేదు. ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదే నేను చేసిన ద్రోహం కావచ్చు. నా ప్రజలకు నన్ను దూరం చేయడానికి చేసిన ఈ ద్రోహం నాకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం కూడా చేయని వాళ్లకు టికెట్లు ఇచ్చారు. ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా ఉద్యమకారులను పక్కనబెట్టారు. తెలంగాణకు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లే ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు పెద్ద ముఖాలుగా ఉండటం బాధిస్తోంది. ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలన్న ఆశయం నెరవేరకపోగా నియంతృత్వ పోకడలను ప్రజలపై రుద్దుతున్నారు. జనం త్వరలోనే దీన్ని గుర్తిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు కోరుతున్నా సమయం తక్కువగా ఉండటం వల్ల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. జీవితాంతం ప్రజల మేలు కోసం పనిచేస్తూనే ఉంటా. కష్టకాలంలో తోడున్న మద్దతుదారులకు ధన్యవాదాలు’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్‌దే ద్రోహం
Published Tue, Mar 26 2019 3:33 AM | Last Updated on Tue, Mar 26 2019 3:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment