చేవెళ్ల ఆశాకిరణం డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి | Gaddam Ranjith Reddy Chevella TRS MP Candidate The Face of the Future | Sakshi
Sakshi News home page

చేవెళ్ల ఆశాకిరణం డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి

Published Fri, Apr 5 2019 12:41 PM | Last Updated on Sat, Apr 6 2019 2:26 PM

Gaddam Ranjith Reddy Chevella TRS MP Candidate The Face of the Future - Sakshi

అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌.. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో కూడా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. తమ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా ఏడుగురు సిట్టింగ్‌లకు అవకాశం ఇచ్చిన ఆయన.. అనూహ్యంగా పది మంది కొత్త అభ్యర్థులకు స్థానం కల్పించారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చేవెళ్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఉన్నత విద్యనభ్యసించి వ్యాపారవేత్తగా ఎదిగిన ఆయన.. తన ప్రజాసేవను మరింత విస్తృతం చేసేందుకు ఎంపీగా ఆశీర్వదించాలని కోరుతున్నారు. తనకు అవకాశమిస్తే ప్రజలకు అత్యవరసరమైన విద్యా, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు వలసల నివారణ, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి చేవెళ్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. చేవెళ్లలో తనకు పోటీగా బరిలో నిలిచిన అత్యంత సంపన్న అభ్యర్థి, కాంగ్రెస్‌ నేత కొండా విశ్వేశ్వరరెడ్డిపై గెలవాలంటే కారు గుర్తుకే ఓటేయాలని ప్రజలకు విఙ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజాసేవకు అంకితం...
దాదాపు మూడున్నర దశాబ్దాలుగా చేవెళ్ల ప్రజలతో అనుబంధం పెనవేసుకున్న గడ్డం రంజిత్‌రెడ్డి సెప్టెంబరు 18, 1964లో వరంగల్‌లో జన్మించారు. తన పిల్లలకు ఉన్నత విద్యనభ్యసించాలనే ఉద్దేశంతో ఆయన తండ్రి కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో నగరంలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నుంచి వెటర్నరీ సైన్స్‌ విభాగంలో రంజిత్‌ రెడ్డి పీజీ పట్టా పొందారు. అనంతరం చేవెళ్లలోని అంతాపూర్‌ గ్రామంలోని పౌల్ట్రీఫామ్‌కు సాంకేతిక సలహాదారుగా కెరీర్ ప్రారంభించారు. బ్రీడింగ్‌, ఫార్మింగ్‌, మార్కెటింగ్‌ తదితర విభాగాల్లో విశేష అనుభవం గడించిన ఆరేళ్ల తర్వాత ఎస్‌ఆర్‌ హ్యాచరీస్‌ అనే ప్రైవేటు సంస్థను నెలకొల్పారు. తన వ్యాపార భాగస్వామి డాక్టర్‌ తిరుపతిరెడ్డితో కలిసి అనతి కాలంలోనే తన కంపెనీని చేవెళ్లలో విస్తరించి విజయపథంలో దూసుకుపోతున్నారు. ఎస్‌ఆర్‌ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న రంజిత్‌ రెడ్డి..తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వంటి పలు పదవులు చేపట్టారు. పౌల్ట్రీ వ్యాపారులు, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపుతున్నారు. కంపెనీ నిర్వహణ, సామాజిక కార్యక్రమాల ద్వారా వేలాది మందికి ఆయన ఉపాధి కల్పించి ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు.

చేవెళ్లతో ప్రత్యేక అనుబంధం...
చేవెళ్ల తన స్వస్థలం కాకపోయినప్పటికీ తనకు, తన కుటుంబ సభ్యులకు మంచి భవిష్యత్తు అందించిన చేవెళ్ల అంటే రంజిత్‌రెడ్డికి ప్రత్యేక అభిమానం. పుట్టింది వరంగల్‌లోనే అయినా 35 ఏళ్లుగా చేవెళ్ల ప్రజల ఆత్మీయత, అనురాగాలు పొందినందు వల్ల వారితో విడదీయలేని అనుబంధం ఏర్పడిందని చెబుతూ ఉంటారు. నియోజకవర్గాల్లోని పలు గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, అదేవిధంగా యవతకు ఉపాధి కల్పించడం వంటి సామాజిక కార్యక్రమాలు ఆయనలోని సేవాతృష్ణకు నిదర్శనం. అదేవిధంగా ఉన్నత విద్యావంతుడైన రంజిత్‌ రెడ్డి.. విద్యకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి పలు ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాలలు స్థాపించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం, వొకేషనల్‌ ట్రెయినింగ్‌ల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచి భరోసా ఇస్తున్నారు. తద్వారా అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.


ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్న రంజిత్ రెడ్డి భార్య సీతా రంజిత్ రెడ్డి

రాజకీయ ప్రస్థానం..
తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్‌ దార్శనికతకు ముగ్ధుడైన రంజిత్‌ రెడ్డి 2004లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ రంగ అభివృద్ధికి పాటుపడుతూ.. అదే సమయంలో సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రంజిత్‌ రెడ్డి కేసీఆర్‌ దృష్టిని ఆకర్షించారు. అందుకే ఆయనపై నమ్మకం ఉంచి తానెంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో నియోజకవర్గ ముఖ్య నేతలు మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిల పూర్తి మద్దతుతో రంజిత్‌ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.

(సాక్షి అడ్వర్ట్‌టోరియల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement