సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకూ చేసిన అప్పులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు నేరుగా సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు దుబారా ఖర్చులతో ప్రజలపై మోయలేని భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దుబారాపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రా? లేక రియల్ ఎసేŠట్‌ట్, స్టాక్ మార్కెట్ ఏజెంటా? అని ప్రశ్నించారు. గతంలో తొమ్మిదేళ్లు పాలించినపుడు చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులతో అస్తవ్యస్తం చేశారని, మళ్లీ ఇప్పుడు అధోగతి పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో రాష్ట్ర అప్పు రూ. 90 వేల కోట్లు ఉంటే నాలుగున్నరేళ్లలో ఆ అప్పును రూ. 2.50 లక్షల కోట్లకు తీసుకెళ్లారని ధ్వజమెత్తారు.
రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ. 3 వేల కోట్లతో తాత్కాలిక భవనాలు కట్టామని చంద్రబాబు చెబుతున్నారని, పోలవరం నిర్మాణానికి రాష్ట్రం ఖర్చు చేసిన రూ. 9 వేల కోట్లు కేంద్ర ఇచ్చామంటోందని, అటువంటప్పుడు చంద్రబాబు రూ. లక్షన్నర కోట్లు అప్పు ఎందుకు చేశారు, దేనికోసం ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘క్రెడిట్ రేటింగ్స్ రావటం లేదని అందుకే బాండ్స్ కోసం వెళ్లామని కుటుంబరావు ఓ వైపు చెబుతారు.. మరోవైపు బాబును చూసే బాండ్స్ వచ్చాయంటారు. మరి 10.32 శాతం వడ్డీని బాండ్స్‌కు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో చెప్పరు’’ అని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ రూ. 200 కోట్లు 9 శాతం వడ్డీకి తీసుకుందని, చంద్రబాబు ఎక్కువ వడ్డీ ఎందుకు చెల్లిస్తోందని ప్రశ్నించారు.
బాండ్లు తీసుకున్న వారి పేర్లను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబు పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ, ఎంపీ, రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి రూ. వేల కోట్లు బ్యాంకుకు ఎగనామం పెట్టారని, ఇటువంటి చరిత్రగల వారిని చంద్రబాబు తన చుట్టూ పెట్టుకోవడంలోనే సీఎం ఉద్దేశం స్పష్టమవుతోందన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒకవైపు రూ. 4 వేల కోట్లు పైగా బాండ్స్ ద్వారా సేకరిస్తామని చెబుతూ.. రూ. 48 వేల కోట్లకు టెండర్లు పిలుస్తున్నారని, దీని ద్వారా ఏ మెసేజ్ ఇస్తున్నట్లుని ప్రశ్నించారు. అప్పు చేసి చంద్రబాబు తన బినామీలు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పిస్తున్నారని, మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని నిలదీశారు.
గెలవలేమని తెలిసే.. టెండర్లు
రాబోయే ఎన్నికల్లో గెలవలేమని తెలిసే ఇప్పుడు చంద్రబాబు హడావుడిగా టెండర్లు పిలిచి కాంట్రక్టర్ల నుంచి కమీషన్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఆ భారమంతా ప్రజలపై మోపాలన్నదే ఆయన ఆలోచనగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మేధావులు, విద్యార్థులు ఒక్కసారి చంద్రబాబు చర్యలను గమనించాలని శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రంలోని అప్పులు తక్కువ, ఆస్తులు ఎక్కువుగా ఉండేవని చెప్పారు. ఆ మహానేత ప్రాజెక్టులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారన్నారు. చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు రూ. 30 కోట్లు చొప్పున ఖర్చుచేస్తున్నారని, రాష్ట్రం కష్టాల్లో ఉందని చెబుతూనే దుబాయికి ప్రత్యేక విమానాల్లో వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెచ్చిన అప్పులు ఏం చేశారు?
Published Tue, Aug 28 2018 3:49 AM | Last Updated on Tue, Aug 28 2018 3:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment