
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత 40 పేజీల అబద్ధాలు చదవించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగం అబద్ధాల కరపత్రమని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ టీడీపీ అబద్ధాల కరపత్రం చదవడం దురదృష్టకరం. అది ఏపీ ప్రజలు వినాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘గవర్నర్ ప్రసంగంలో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని చెప్పించారు. అంటే అసెంబ్లీ దెయ్యాల కొంపనా’ అని ప్రశ్నించారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కిన టీడీపీ ప్రభుత్వ తీరుతో అసెంబ్లీని దెయ్యాల కొంపగా భావించాల్సిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని కోడెల శివప్రసాద్ కాలరాస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి ఆహ్వానించినా రావడం లేదని ఆయన దొంగమాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కండువాలు కప్పుకొని కోడెల టీడీపీ సభల్లో పాల్గొంటున్నారని ఫైర్ అయ్యారు.
‘రాష్ట్రాన్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ... విభజన ద్వారా తలెత్తిన సమస్యలను పరిష్కరించాల్సింది కేంద్రంలోని ఎన్డీయే. కానీ, నాలుగేళ్లు ఎన్డీయేతో అధికారాన్ని పంచుకున్న చంద్రబాబు.. మళ్లీ ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో.. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పించడం దారుణం’ అన్నారు. ‘జపాన్, సింగపూర్ తరహాలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని గవర్నర్ చెప్పారు. జాతీయ సగటు కన్నా ఏపీ వృద్ధి రేటు ఎక్కువని అన్నారు. 55 శాతం వృద్ధి పెరిగినట్లు పేర్కొన్నారు. నిజంగా వృద్ధి పెరిగినట్టు నిరూపించగలరా’ అని సవాల్ విసిరారు.
చేతగాని ప్రభుత్వం కనుకనే చేతగాని బడ్జెట్
ఎన్నిలకు ముందు టీడీపీ ప్రభుత్వం పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తోందని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకుని ఎన్నికలకు వెళ్లకుండా శ్వేత పత్రాలు, కొత్త హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. చేతగాని ప్రభుత్వం.. చేతగాని బడ్జెట్ ప్రవేశపెడుతోందని విమర్శించారు. నాడు హంద్రీనీవా అవసరమే లేదన్న చంద్రబాబు.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమండ్ చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే హంద్రీనీవా, గాలేరు పనులు జరిగాయని గుర్తుచేశారు. ఆ మహానేత చెమట చుక్కల ఫలితంగానే రాయలసీమకు నీళ్లొచ్చాయని అన్నారు. టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నైజమే మోసం .. ప్రజలే వైఎస్సార్‌సీపీ ఎజెండా అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment