మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలు విద్వేషాలు రగిల్చే విధంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా అదుపు కాకూడదు, విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ సమస్య మరింత పెద్దది కావాలని చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు. అందు కోసమే హైదరాబాద్‌లో కూర్చుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని, టైంపాస్‌కు లేఖలు రాస్తున్నారని విమర్శించారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తూ కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తూ ముఖ్యమంత్రిగా జగన్ మంచి పేరు తెచ్చుకుంటుంటే చంద్రబాబు మాత్రం ఆయనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. వారు ఇంకా ఏమన్నారంటే...
► కరోనా వల్ల లక్షల మంది చనిపోతే తనకు బాగా పని పెరుగుతుందనే దురాలోచనతో చంద్రబాబు ఉన్నట్లున్నారు. అధికారంలో ఉన్నపుడు ఎవరికీ మంచి చేయని వ్యక్తి ఇపుడు మాత్రం ఉద్యోగులు, పెన్షనర్ల శ్రేయస్సు కోసమంటూ టైంపాస్ లేఖలు రాస్తున్నారు.
► విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో సీఎం జగన్ స్పందించిన తీరును అందరూ అభినందిస్తుంటే చంద్రబాబు మాత్రం అర్థంలేని విమర్శలు చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకూడదు, ఇంకా సమస్యలు సృష్టించాలి, విద్వేషాలు రగిల్చాలి అనే ఉద్దేశంతోనే చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు.
► పది నిమిషాల వీడియో ఫిల్ము, పబ్లిసిటీ పిచ్చి కోసం 29 మందిని గోదావరి పుష్కరాలప్పుడు తొక్కి చంపావు. అపుడు నువ్వు ఏంచేశావో మరిచావా? అదే విశాఖలో జగన్ సానుభూతితో సమస్యను పరిష్కరిస్తే దుర్మార్గంగా మాట్లాడతావా?
► ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛను, రెండోది ఉంటే తొలగింపేనని ఈనాడులో ప్రధానంగా వార్త రాశారు. ఎందుకింత దుర్మార్గంగా వార్తలు రాస్తారు. పత్రికా విలువలంటే ఇవేనా? ఈ జీవో ఏమైనా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చారా? పత్రికాధిపతులే చిలకజోస్యం, కొంగజపం వంటి చర్చలు పెట్టి బురదచల్లే కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా విలువలు ఏముంటాయి?
► వైఎస్ జగన్ సీఎం అయ్యేనాటికి ఖజానాలో రూ 100 కోట్లు మాత్రమే ఉన్నాయని ఆ పత్రికలే రాశాయి. అయినా ఇచ్చిన మాట తప్పకుండా ఆరు నెలల్లో అన్ని హామీలను జగన్ అమలు చేసిన తీరు మీకు కనిపించదా?
► ఏపీ మాదిరిగా అన్ని రాష్ట్రాలూ వ్యవహరిస్తే కరోనాను అదుపు చేయవచ్చని కేంద్ర బృందం ప్రతినిధి మధుమితా దూబే ప్రశంసించారు. అయినా చంద్రబాబు బృందం విమర్శలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment