జానీవాకర్‌ జేసీ.. బాబు భజన చాలించు: గడికోట | Gadikota Srikanth Reddy Fires on JC Divakar Reddy and Chandrababu | Sakshi
Sakshi News home page

జానీవాకర్‌ జేసీ.. బాబు భజన చాలించు: గడికోట

Published Wed, May 30 2018 2:04 AM | Last Updated on Thu, Aug 16 2018 5:07 PM

Gadikota Srikanth Reddy Fires on JC Divakar Reddy and Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ విజయవాడలో నిర్వహించింది మహానాడు కాదని.. అది తిట్ల పోటీగా సాగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశామో చెప్పుకోకుండా కేవలం తిట్ల దండకంతో పూర్తి చేశారని ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహానాడులో చంద్రబాబు నాలుగైదు బెల్ట్‌షాపులు పెట్టించినట్లుగా ఉందని, అక్కడికి తాగి వచ్చి సంస్కారం లేకుండా ప్రజలు ఏమనుకుంటారనే ఇంగితజ్ఞానం లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వారి భాషను చూసి సభ్య సమాజం తలదించుకుంటుందని అన్నారు.జానీవాకర్‌రెడ్డి అయిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడిన భాష విని వేదికపై ఆనందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సంస్కారం లేని వ్యక్తులు తనలాగే ఉంటారని నిరూపించారన్నారు.

రాజనర్తకిగా ఉండేవారు ఏ రాజు అధికారంలో ఉంటే వారి ముందు నాట్యం చేస్తారని, అదే విధంగా జేసీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వారికి అనుగుణంగా నాట్యం చేస్తుంటాడని గడికోట ఆగ్రహం వ్యక్తం చేశారు.జేసీ ఒకే నంబరు ప్లేటుతో 20 బస్సులను అక్రమంగా తిప్పుకున్నా ఇబ్బందులు రాకూడదని, తాడిపత్రిలో మాఫియా వ్యవహారాలు నడిపినా, హత్యలు చేసినా చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కావాలని..చంద్రబాబును సంతోష పర్చడానికి వైఎస్‌ కుటుంబంపై మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.తమ నోళ్లను జగన్‌ కట్టేస్తున్నారని లేకుంటే మీ(జేసీ) పురాణాలు బయట పెడితే రోడ్ల మీద తిరగలేరని హెచ్చరించారు. 2004కు ముందు ఒక వ్యక్తి పేరు చెబితే జేసీ చిన్న వేలు చూపించే పరిస్థితి ఉండేదని ఆయన గుర్తు చేశారు.

2004 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజాభిమానం వల్ల ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆయన దయతోనే మంత్రి అయ్యారని గడికోట గుర్తు చేశారు. జేసీ బూతులను టీవీలు లైవ్‌ ఇస్తున్నాయని అభ్యంతరం చెప్పే అనుభవం చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు టీడీపీ మేనిఫెస్టోను ఒక అశ్లీలమైన పుస్తకం అన్నట్లుగా.. మహానాడులో మాట్లాడే వారు ఏ ఒక్కరైనా అందులో ఉన్నవన్నీ చేశామని చెప్పగలరా? అని  సూటిగా ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలు అల్లాడుతున్నారని.. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులున్నాయన్నారు.

పోలవరంలో భూములు కోల్పోయిన వారికి ఎకరాకు రూ.80లక్షలు మొదలు రూ.1 కోటి వరకు ఇచ్చారని.. మరి అంతే పరిహారం అనంతపురంలో ఇచ్చారా? అని గడికోట నిలదీశారు. వాస్తవానికి అది టీడీపీ కాదని, దానికి తెలుగు బూతుల పార్టీ (టీబీపీ)అని పేరు పెట్టుకోవాలని గడికోట సూచించారు. చంద్రబాబు వలలో పడిన జేసీ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని,  తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో ఒకసారి అర్థం చేసుకోవాలని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. దివాకర్‌రెడ్డి, మంత్రి సోమిరెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే సర్వనాశనం అవుతారన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement