కర్నూలు :ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో చిచ్చు పెట్టాలని మంత్రి అఖిలప్రియ, ఆమె అనుచరులు చూస్తున్నారని, అలా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు రాజారెడ్డిపై ఆదివారం జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సక్రమంగా స్పందించి ఉంటే ఇలాంటి దాడులు జరిగేవి కావన్నారు. ఈ విషయంపై ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆళ్లగడ్డ ప్రజలు పెద్ద ఫ్యాక్షన్‌ను చూశారన్నారు.
ఇంట్లో నుంచి బయటకు వస్తే తిరిగి ప్రాణాలతోవెళ్తామో లేదో అనే పరిస్థితుల్లోనే ఎవరూ భయపడకుండా తిరిగారన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే సహిం చేది లేదన్నారు. పదిరోజుల్లో పట్టణ పోలీస్ స్టేషన్‌లో మూడు ఫిర్యాదులు చేశామని, మొదట ఇచ్చిన ఫిర్యాదుకే స్పందించి నిందితులను అదు పులోకి తీసుకుని, మందలించి ఉంటే ఈ ఘటనలు జరిగేవా అని ప్రశ్నించారు. పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని దాడులను అరికట్టాలన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎలాంటి హాని జరిగినా సహించబోమన్నారు. ఫ్యాక్షన్ గొడవలకు 1999 నుంచి నియోజకవర్గ ప్రజలు దూరంగా ఉన్నారని, మళ్లీ అలాంటి పరిస్థితులను సృష్టించవద్దని సూచించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి, నాయకులు పలచాని బాలిరెడ్డి, శివనాగిరెడ్డి, రంగేశ్వర్‌రెడ్డి, పత్తి నారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment