
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాత్రి ఆయన సాక్షితో మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించి, మార్కెట్ యార్డులకు తరలించిన ధాన్యానికి గిట్టుబాటు ధరల్లేక సతమతమవుతుంటే, వర్షం రూపంలో మరో పిడుగు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు ధాన్యం మొత్తం వర్షపు నీటిలో కొట్టుకుపోయిందని చెప్పారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించి.. మార్క్‌ఫెడ్, మిల్లర్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మార్కెట్ యార్డులకు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కజొన్నలు అమ్మిన రైతులకు ఇవ్వాల్సిన రూ.200 కోట్ల బకాయిలను మార్క్‌ఫెడ్ చెల్లించడం లేదన్నారు. మార్క్‌ఫెడ్, ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే రూ.200 కోట్లు రైతులకు చెల్లించి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment