సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ దాదాపు తొమ్మిది నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లి ఏం సాధించాలనుకుంటున్నదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. హైదరాబాద్ వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలన్నింటినీ టీఆర్‌ఎస్ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ ముఖ్య నేతల సమావేశం జరిగిందన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. తీర్మానాన్ని వైఎస్ జగన్ నిర్ణయానికి అప్పజెప్పామని, ఆయన నిర్ణయం మేరకే ముందుకెళతామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మొదటగా ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం గడువు ముగియక ముందే ముందస్తు పేరుతో ఎన్నికలకు ఎందుకు వెళుతున్నదో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment