
న్యూఢిల్లీ: ఎలాంటి సవాళ్లనెదుర్కొనేందుకైనా సిద్ధమేనని తూర్పు ఢిల్లీ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. రాజకీయ క్రీడకు తాను కొత్త అని, వివాదాలపై ఎలా స్పందించాలో ఒక్కోసారి తనకు సరిగ్గా తెలియడం లేదని అన్నారు. ఆప్ నేత అతిషి, కాంగ్రెస్ సీనియర్ నేత అర్విందర్ సింగ్ లవ్లీతో తలపడుతున్న గంభీర్.. రాజకీయాల్లో సవాళ్లు క్రికెట్‌తో పోల్చుకుంటే చాలా విభిన్నమైనవంటూనే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమని చెప్పారు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితి తనకెంతో ఉత్తేజాన్నిస్తోందని అన్నారు.
రూల్స్ తెలియనివాళ్లు గేమ్ ఆడకూడదన్న అతిషి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. భావోద్వేగాలు, సదుద్దేశం, స్వచ్ఛ హృదయంతో రాజకీయాల్లోకి రావడమనే ఒకే ఒక్క నిబంధన తనకు తెలుసునని చెప్పారు. రాజకీయాలకు ఇదే ప్రథమ సూత్రమని, వాళ్లే నిబంధనల గురించి మాట్లాడుతున్నారో తనకు తెలియదని అన్నారు. రాజేందర్ నగర్‌లో తనకు ఒకేఒక్క ఓటర్ ఐడీ కార్డు ఉందని, చిన్నప్పుడు కరోల్‌బాగ్‌లో అమ్మమ్మ వద్ద ఉంటుండేవాడినని చెప్పారు. ఢిల్లీలో ఈతరంతోపాటు తర్వాతి తరం కూడా మంచి గాలి పీల్చాలని, స్వచ్ఛమైన నీళ్లు తాగాలని అన్నారు.