Delhi Lok Sabha
-
Rahul Gandhi: మహిళలంటే చిన్నచూపు!
న్యూఢిల్లీ: మహిళలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగానే చూస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నార్త్ వెస్ట్ ఢిల్లీ పార్టీ అభ్యర్థి ఉదిత్ రాజ్ తరఫున గురువారం ఢిల్లీలోని మంగోల్‌పురిలో మహిళలు మాత్రమే పాల్గొన్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ఎంతో ఆర్భాటంగా ఇప్పుడే మహిళాలోకం కలలు సాకారం చేస్తున్నట్లు పార్లమెంట్లో నారీశక్తి వందన్ అధినయమ్(మహిళా రిజర్వేషన్ బిల్లు) ప్రవేశపెట్టారు. ఆ చట్టం ఇప్పుడు కాదు ఏకంగా పదేళ్ల తర్వాత అమలుచేస్తామని తీరిగ్గా చెప్పారు. ఈ నిర్ణయం వెనుక ఒక సిద్దాంతముంది. అదే ఆర్ఎస్ఎస్. బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ అయితే ఏకంగా మహిళలను కనీసం ‘శాఖ’లోకి అడుగుపెట్టనివ్వడంలేదు. మహిళలను రెండో తరగతి పౌరులుగా భావించాలని ఆర్ఎస్ఎస్ నరనరాల్లో నాటుకుపోయింది’ అని విమర్శలు గుప్పించారు. వర్కింగ్ ఉమెన్ పనికి గుర్తింపు దక్కట్లేదు ‘‘భారత్‌లో ప్రతీ రంగం గురించి మాట్లాడతాంగానీ వర్కింగ్ ఉమెన్ ఇంట్లోనూ చేసే శ్రమకు ఎక్కడా గుర్తింపు దక్కట్లేదు. రోజంగా ఆఫీస్/కార్యస్థలంలో పనిచేసి అలసిపోయిన మహిళలు ఇంటికొచ్చాక మళ్లీ రెండో షిప్ట్ మొదలెడతారు. పిల్లల ఆలనాపాలనా చూసుకుని ఇంటి పనులన్నీ చేస్తారు. ఈ పనికి వాళ్లకు ఎలాంటి చెల్లింపులు ఉండవు. పురుషులు రోజుకు 8 గంటలు పనిచేస్తే మహిళలు 16 గంటలపైనే పనిచేస్తారు. వారి శ్రమకు ప్రతిఫలంగా ఏమీ దక్కట్లేదు. ఇది ఒక రకంగా చెల్లింపులులేని గుర్తింపులేని పని. మేం అధికారంలోకి వస్తే మహాలక్ష్మీ యోజన ద్వారా పేద మహిళలకు నెలకు రూ.8,500 చొప్పున ఏటా రూ.1 లక్ష వారి ఖాతాలో జమచేస్తాం’’ అని రాహుల్ అన్నారు. మే 25నాటి పోలింగ్‌కు ప్రచారం గురువారంతో ముగుస్తుండటంతో ఢిల్లీ మెట్రోలోనూ రాహుల్ ప్రయాణించారు. ‘‘నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ తరఫున సైతం రాహుల్ దిల్షాద్ గార్డెన్ ప్రాంతంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీ భవన్లో మధ్యాహ్న భోజనం ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన రాహుల్ మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్/తెలంగాణ భవన్‌కు వచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌సహా దాదాపు 10 మందితో కలిసి రాహుల్ భోజనం చేశారు. రాహుల్ పూరీలు, చపాతీలు, కోడికూర వేపుడు, రొయ్యల వేపుడు ఆర్డర్ ఇచ్చారు. తొలుత పూరీ/చపాతీని పప్పుతో కలిపి తిన్నారు. తర్వాత చికెన్ ఫ్రై, రొయ్యల ఫ్రైతో చపాతీ/పూరీ తిన్నారు.మీ కీలక పాత్ర పోషించండి...సోనియా గాంధీ ఢిల్లీ పరిధిలో ప్రచారం చివరిరోజు సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఓటర్లకు ఒక వీడియో సందేశం విడుదలచేశారు. ‘‘ ప్రజాస్వామ్య పరిరక్షణకు జరుగుతున్న కీలక ఎన్నికలివి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రాజ్యాంగబద్ధ సంస్థలపై దాడులు కొనసాగుతున్న వేళ వచి్చన ఎన్నికలివి. ఈ పోరాటంలో మీరు మీ కీలక పాత్ర పోషించండి. మీ ఓటు ఉపాధి కల్పనకు బాటలువేస్తుంది. ఎగసిన ధరలను కిందకు దింపుతుంది. మహిళలకు సాధికారతను కట్టబెడుతుంది. మెరుగైన భవిష్యత్తుతో సమానత్వాన్ని సాధిస్తుంది. ఢిల్లీ పరిధిలోని ఏడు ఎంపీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి అభ్యర్థులను గెలిపించండి’ అని సోనియా సందేశమిచ్చారు. -
Lok Sabha Election 2024: ఓటేస్తే ఉచిత బైక్ రైడ్
అవును! పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఓటేసి.. తిరిగి ఇంటికి వెళ్లేప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుంటే చాలు. ఉచితంగా ఇంటికి తీసుకెళ్లి దింపేస్తారు. ఓహో సూపరని ఆనందిస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మన రాష్ట్రంలో కాదు. దేశ రాజధాని ఢిల్లీలో. అక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ సంస్థలు పాటుపడుతున్నాయి. ర్యాపిడో ఈ ప్రక్రియలో భాగస్వామ్యమైంది. ఓటర్లు ఓటేసిన అనంతరం పోలింగ్ బూత్‌ల నుంచి ఇంటికి చేరుకునేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలి్పంచింది. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బైక్ టాక్సీ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మే 25న ఢిల్లీ లోక్‌సభ పోలింగ్ రోజున జరగనుంది. ఆ రోజు ఓటేసిన అనంతరం ప్రయాణికులు బైక్ బుక్ చేసుకుని ఉచితంగా ప్రయాణించవచ్చు. ఢిల్లీలో 80 లక్షల మంది ర్యాపిడో సబ్స్క్రైబర్లు ఉండగా.. ఆ సంస్థకు ఎనిమిది లక్షల మంది బైక్ డ్రైవర్లు ఉన్నారు. -
63 మంది సిట్టింగ్‌లకు నో టికెట్.. బీజేపీ వ్యూహం ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీ.. ‘అబ్కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ సర్కార్’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతుంది. 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా లోక్ సభ అభ్యర్ధులను ఎంచుకుంటోంది. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇచ్చేలా భారీ ఎత్తున 63 లోక్ సభ సిట్టింగ్ స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. ఢిల్లీ ఏకంగా ఏడు లోక్ సభ స్థానాల్లో ఆరు సిట్టింగ్ అభ్యర్ధులను మార్చేసింది. ఏడుకి ఏడు స్థానాల్లో కైవసం చేసుకునేలా వ్యూహా, ప్రతి వ్యూహాలను అమలు చేస్తోంది. బీజేపీ ఈసారి లోక్‌సభ ఎన్నికల అభ్యర్ధుల మొదటి, రెండు జాబితాలలో 63 మంది సిట్టింగ్ ఎంపీల స్థానాల్లో కొత్త నేతలకు అవకాశం కల్పిచ్చింది. మార్చి 2న విడుదల చేసిన 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో 33 మంది కొత్త నేతలకు టికెట్లు కేటాయిస్తూ జాబితాను విడుదల చేసింది. మార్చి 13న విడుదల చేసిన రెండో జాబితాలో 30 మంది ఎంపీలను భర్తీ చేసింది. ఆమ్ ఆద్మీ - కాంగ్రెస్‌కు చెక్ పెట్టేలా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీ లోక్ సభ స్థానాల్లో నేతల ఎంపికపై తీవ్ర కసరత్తే చేసింది. ఢిల్లీ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. వరుస విజయాల్ని సొంతం చేసుకున్నప్పటికీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ - కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకున్నాయి. దీంతో ఈ మొత్తం స్థానాల్లో గెలుపొందేలా ఏడుగురు సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులలో ఆరుగురిని మార్చింది. సిట్టింగ్ ఎంపీలలో మనోజ్ తివారీ మాత్రమే మరోసారి సీటు దక్కించుకున్నారు. గెలుపే ముఖ్యం అభ్యర్థుల ఎంపికలో గెలుపే కీలకమని భావిస్తున్న బీజేపీ అగ్రనేతలు వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్న బిధురి, వర్మలకు టికెట్ నిరాకరించింది. క్రికెట్ పై దృష్టిసారించేందుకు అవకాశం కల్పించేలా తనని రాజకీయ బాధ్యతల నుంచి తనను తప్పించాలని పార్టీ నాయకత్వాన్ని కోరడంతో గౌతమ్ గంభీర్ స్థానంలో మరో కొత్త నేతని ఎంపిక చేసింది. అభ్యర్ధుల జాబితా విడుదల చేసిన తరుణంలో హర్ష్ వర్ధన్ రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 6 మంది కొత్త అభ్యర్ధులు ఎవరంటే? ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అగ్రనాయకత్వం ఎంపిక చేసిన ఆరుగురు కొత్త నేతల్లో బీజేపీ అగ్రనేత, దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్, యోగేంద్ర చందోలియా, హర్ష్ మల్హోత్రా, రాంవీర్ సింగ్ బిధూరి, ప్రవీణ్ ఖండేల్వాల్, కమల్జీత్ శరావత్‌లు ఉన్నారు. బన్సూరి స్వరాజ్ మినహా మిగిలిన ఐదుగురు అభ్యర్థులు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు. గట్కెక్కిన మనోజ్ తివారీ భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో తివారీ ఒకరు. బీజేపీలో చేరకముందు సమాజ్‌వాదీ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014లో ఈశాన్య ఢిల్లీ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో అదే స్థానం నుంచి మరోమారు విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన తివారీకి తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్‌లో విస్తరించి ఉన్న పూర్వాంచల్ ప్రాంతాలలో తివారీ ఫాలోవర్స్ ఎక్కువమంది ఉన్నారు. గెలుపు తద్యమని భావించింది కాబట్టే బీజేపీ ఆయనకు మరోసారి సీటును అప్పగించింది. -
సవాళ్లకు సిద్ధం
న్యూఢిల్లీ: ఎలాంటి సవాళ్లనెదుర్కొనేందుకైనా సిద్ధమేనని తూర్పు ఢిల్లీ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. రాజకీయ క్రీడకు తాను కొత్త అని, వివాదాలపై ఎలా స్పందించాలో ఒక్కోసారి తనకు సరిగ్గా తెలియడం లేదని అన్నారు. ఆప్ నేత అతిషి, కాంగ్రెస్ సీనియర్ నేత అర్విందర్ సింగ్ లవ్లీతో తలపడుతున్న గంభీర్.. రాజకీయాల్లో సవాళ్లు క్రికెట్‌తో పోల్చుకుంటే చాలా విభిన్నమైనవంటూనే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమని చెప్పారు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితి తనకెంతో ఉత్తేజాన్నిస్తోందని అన్నారు. రూల్స్ తెలియనివాళ్లు గేమ్ ఆడకూడదన్న అతిషి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. భావోద్వేగాలు, సదుద్దేశం, స్వచ్ఛ హృదయంతో రాజకీయాల్లోకి రావడమనే ఒకే ఒక్క నిబంధన తనకు తెలుసునని చెప్పారు. రాజకీయాలకు ఇదే ప్రథమ సూత్రమని, వాళ్లే నిబంధనల గురించి మాట్లాడుతున్నారో తనకు తెలియదని అన్నారు. రాజేందర్ నగర్లో తనకు ఒకేఒక్క ఓటర్ ఐడీ కార్డు ఉందని, చిన్నప్పుడు కరోల్‌బాగ్‌లో అమ్మమ్మ వద్ద ఉంటుండేవాడినని చెప్పారు. ఢిల్లీలో ఈతరంతోపాటు తర్వాతి తరం కూడా మంచి గాలి పీల్చాలని, స్వచ్ఛమైన నీళ్లు తాగాలని అన్నారు. -
54 ఏళ్ల తరువాత..మరోసారి మహిళ
న్యూఢిల్లీ: దాదాపు 54 ఏళ్ల తరువాత న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో మహిళా అభ్యర్థి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి మీనాక్షి లేఖి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్మాకెన్ను ఓడించడం తెలిసిందే. న్యూఢిల్లీ ఎంపీగా 54 ఏళ్ల క్రితం స్వాతంత్య్ర సమరయోధురాలు సుచేతా కృపలానీ ఎంపీగా వ్యవహరించారు. ఆమె 1952-1957 మధ్యకాలంలో న్యూఢిల్లీ ఎంపీగా పనిచేశారు. అప్పటి నుంచి 2014 వరకు పురుష ఎంపీలే ఇక్కడ పనిచేశారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి కూడా 1977లో న్యూఢిల్లీ ఎంపీగా జనతాపార్టీ టికెట్‌తో ఎన్నికయ్యారు. 1980లో మాత్రం బీజేపీ టికెట్‌తో మళ్లీ ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. తదనంతరం ఎల్కే అద్వానీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ నేతలు న్యూఢిల్లీ ఎంపీలుగా ఎన్నికయ్యారు. 54 ఏళ్ల తరువాత న్యూఢిల్లీ మహిళా ఎంపీగా వ్యవహరించనున్న లేఖికి ఈసారి 4.53 లక్షల ఓట్లు పడ్డాయి. ఈమె సమీప ప్రత్యర్థి ఆశిష్ ఖేతాన్‌కు 2.90 లక్షల ఓట్లు పోలయ్యాయి. అజయ్ మాకెన్ 1.82 లక్షల ఓట్లతో సరిపెట్టుకున్నారు.