సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీ.. ‘అబ్‌కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ సర్కార్’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతుంది. 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా లోక్ సభ అభ్యర్ధులను ఎంచుకుంటోంది. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇచ్చేలా భారీ ఎత్తున 63 లోక్ సభ సిట్టింగ్ స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. ఢిల్లీ ఏకంగా ఏడు లోక్ సభ స్థానాల్లో ఆరు సిట్టింగ్ అభ్యర్ధులను మార్చేసింది. ఏడుకి ఏడు స్థానాల్లో కైవసం చేసుకునేలా వ్యూహా, ప్రతి వ్యూహాలను అమలు చేస్తోంది.
బీజేపీ ఈసారి లోక్‌సభ ఎన్నికల అభ్యర్ధుల మొదటి, రెండు జాబితాలలో 63 మంది సిట్టింగ్ ఎంపీల స్థానాల్లో కొత్త నేతలకు అవకాశం కల్పిచ్చింది. మార్చి 2న విడుదల చేసిన 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో 33 మంది కొత్త నేతలకు టికెట్లు కేటాయిస్తూ జాబితాను విడుదల చేసింది. మార్చి 13న విడుదల చేసిన రెండో జాబితాలో 30 మంది ఎంపీలను భర్తీ చేసింది.
ఆమ్ ఆద్మీ - కాంగ్రెస్‌కు చెక్ పెట్టేలా
పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీ లోక్ సభ స్థానాల్లో నేతల ఎంపికపై తీవ్ర కసరత్తే చేసింది. ఢిల్లీ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. వరుస విజయాల్ని సొంతం చేసుకున్నప్పటికీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ - కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకున్నాయి. దీంతో ఈ మొత్తం స్థానాల్లో గెలుపొందేలా ఏడుగురు సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులలో ఆరుగురిని మార్చింది. సిట్టింగ్ ఎంపీలలో మనోజ్ తివారీ మాత్రమే మరోసారి సీటు దక్కించుకున్నారు.
గెలుపే ముఖ్యం
అభ్యర్థుల ఎంపికలో గెలుపే కీలకమని భావిస్తున్న బీజేపీ అగ్రనేతలు వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్న బిధురి, వర్మలకు టికెట్ నిరాకరించింది. క్రికెట్ పై దృష్టిసారించేందుకు అవకాశం కల్పించేలా తనని రాజకీయ బాధ్యతల నుంచి తనను తప్పించాలని పార్టీ నాయకత్వాన్ని కోరడంతో గౌతమ్ గంభీర్ స్థానంలో మరో కొత్త నేతని ఎంపిక చేసింది. అభ్యర్ధుల జాబితా విడుదల చేసిన తరుణంలో హర్ష్ వర్ధన్ రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
6 మంది కొత్త అభ్యర్ధులు ఎవరంటే?
ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అగ్రనాయకత్వం ఎంపిక చేసిన ఆరుగురు కొత్త నేతల్లో బీజేపీ అగ్రనేత, దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్, యోగేంద్ర చందోలియా, హర్ష్ మల్హోత్రా, రాంవీర్ సింగ్ బిధూరి, ప్రవీణ్ ఖండేల్వాల్, కమల్జీత్ శరావత్‌లు ఉన్నారు. బన్సూరి స్వరాజ్ మినహా మిగిలిన ఐదుగురు అభ్యర్థులు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు.
గట్కెక్కిన మనోజ్ తివారీ
భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో తివారీ ఒకరు. బీజేపీలో చేరకముందు సమాజ్‌వాదీ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014లో ఈశాన్య ఢిల్లీ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో అదే స్థానం నుంచి మరోమారు విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన తివారీకి తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్‌లో విస్తరించి ఉన్న పూర్వాంచల్ ప్రాంతాలలో తివారీ ఫాలోవర్స్ ఎక్కువమంది ఉన్నారు. గెలుపు తద్యమని భావించింది కాబట్టే బీజేపీ ఆయనకు మరోసారి సీటును అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment