
సాక్షి, గుంటూరు: తన ఇంటిముందు టీడీపీ కార్యకర్తలు రభసకు దిగడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ముందు అల్లర్లు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి రాంబాబు, శ్రీకృష్ణదేవరాయలు, బొల్లా బ్రహ్మానాయుడులు కూడా డీఎస్పీని కలిశారు. అనంతరం గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నరసరావుపేట పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అల్లర్లు సృష్టించి బెదిరించాలని చూడటం సరైన పద్దతి కాదన్నారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు.
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గోపిరెడ్డి ఇంటి ముందు దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఇంటి ముందు వేడుకలు చేసుకోవడానికి టీడీపీ కార్యకర్తలకు ఎవరు అనుమతి ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో అల్లర్లు సృష్టిస్తే సహించేదిలేదన్నారు.