సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కలిసే ఎన్నికలు ఆపారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకు అభివృద్ధి జరగాలనే ఉద్దేశ్యంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని భావిస్తే వీళ్లు కుట్రలతో వాయిదా వేయించారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగి ఉంటే రూ.5800 కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉండేదన్నారు. అధిక పర్యాటకులు వచ్చే గోవాలో ఈ నెల 23న స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే మన రాష్ట్రంలో ఎందుకు జరగకూడదని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఇంకా తానే ముఖ్యమంత్రి అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కేరళ సీఎం కూడా అదే చెప్పారు
కరోనాకు పారాసిటమాల్ వేస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడాన్ని చంద్రబాబు తప్పుపట్టడం, హేళన చేయడం సరికాదని గోపిరెడ్డి హితవు పలికారు. కేరళ ముఖ్యమంత్రి కూడా పారాసిటమాల్ వాడాలని శానిటేషన్ గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా వ్యాధి తగ్గడానికి పారాసిటమాల్ మాత్రమే డ్రగ్ ఆఫ్ ఛాయిస్ అని ప్రపంచ దేశాలు చెబుతున్నాయన్నారు. అంతేకాక కరోనా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు ప్రణాళికతో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. భారత్‌లో 114 కరోనా కేసులు నమోదయ్యాయని, దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అందులో భాగంగా విశాఖలో రెండు వందల బెడ్లు, ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేశామని తెలిపారు. (ఎన్నికల వాయిదా: అభివృద్ధి, సంక్షేమం ప్రశ్నార్థకం )
Comments
Please login to add a commentAdd a comment