
ఊటుకూరులో మాట్లాడుతున్న శంకరనారాయణ, చిత్రంలో గోరంట్ల మాధవ్
అనంతపురం , పరిగి: సీఎం చంద్రబాబు పాలనంతా స్వార్థభరితమేనని రాజకీయ లబ్ధి కోసం నారా వారు ఎన్ని అబద్దాలు ఆడటానికి, మోసాలు చేయడానికైనా వెనుకాడబోరని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ మండిపడ్డారు. ఆదివారం పరిగి మండలంలోని ఊటుకూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిన్ను నమ్మం బాబూ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకరానారాయణ మాట్లాడుతూ పసుపు కుంకుమ కార్యక్రమం పేరుతో మహిళలను చంద్రబాబు నిలువునా దగా చేస్తున్నారన్నారు. దఫాలుగా మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తామని మభ్యపెట్టి మోసం చేస్తున్నారన్నారు. కేవలం ఎన్నికల కోసమే చేస్తున్న కుయుక్తులు తప్ప మహిళలపై ఆయనకు ఎలాంటి ప్రేమలేదన్నారు. మహిళలకు ప్రజయోజనం చేకూర్చే సీఎం అయితే నాలుగున్నరేళ్లు నిద్రపోయారా అని ప్రశ్నించారు. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి మరోసారి దోచుకున్న అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తున్నారని శంకరనారాయణ ధ్వజమెత్తారు.
ప్రజా సేవ చేసేందుకేరాజకీయాల్లోకి వచ్చా
ప్రజలకు నేరుగా సేవలు చేయాలన్న కోరికతో రాజకీయాల్లోకి వచ్చానని, సంపాదనపై ఆశ లేదని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్ అన్నారు. రాజకీయ నాయకుడిగా పరిగి మండలంలో అడుగు పెట్టిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యువకులు, ప్రజలు కేరింతలు పెడుతూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ‘బడుగు బలహీన వర్గాల నుండీ వచ్చాను.. వారికి అండగా నిలిచి అభివృద్ధికి చేయూత నివ్వడమే జీవిత లక్ష్యమని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. పోలీస్‌విధి నిర్వహణలో కూడా ఎప్పుడూ పేద ప్రజల పక్షానే నిలిచానన్నారు. ఎన్నో రాజకీయ ఒత్తిడులు, ఇబ్బందులకు గురయ్యానని చెప్పారు. ఉద్యోగ పరంగా పరిమితులు ఉంటాయని, రాజకీయపరంగా ప్రజాసేవకు పరిమితులుండవన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిలిచిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాటలో నడిచి ప్రజల మన్ననలు పొందాలన్న ఆలోచనే ధ్యేయమన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ జయరాం, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి డీవీ రమణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాలాజీ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మారుతీశ్వరరావు, ప్రభు, బీఆర్ నారాయణ, చెన్నకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment