నాలుగు నెలల్లో గుజరాత్ ఎంతగానో మారినట్టు కనిపిస్తోంది. 19 ఏళ్ల 9 నెలలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ జనాదరణ కొద్దికొద్దిగా కోల్పోతోంది. 22 సంవత్సరాల క్రితం అధికారం కోల్పోయిన కాంగ్రెస్ రోజురోజుకూ బలం కూడదీసుకుంటోంది. కమలం కాంతి కొంత మందగించడానికి కారణాలు అనేకం. దాదాపు రెండు దశాబ్దాల పాలన, ఎన్నో ఏళ్లుగా వెన్నంటి ఉన్న పాటీదార్ కులస్తులు(పటేళ్లు) కోటా డిమాండ్‌తో దూరం కావడం, దళితులు, కొన్ని బీసీ సంఘాల్లో అసంతృప్తి- బీజేపీ ఆరో వరుస గెలుపును అడ్డుకుంటాయనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రెండో గుజరాతీ ప్రధానిని దేశానికి అందించిన ఈ వాణిజ్య రాష్ట్రంలో రాజకీయ గాలి మారుతోందని ఎన్నికల సందర్భంగా గుజరాత్‌లో పర్యటిస్తున్న మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. జనాభాలో పన్నెండు శాతమున్న పాటీదార్లలో యువతరం కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతోంది.
40 ఏళ్లు పైబడిన పాతతరం పటేళ్లు మాత్రం కాషాయపక్షానే ఉన్నట్టు చెబుతున్నారు. ప్రాంతాలవారీగా చూస్తే కచ్, సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్, మధ్యగుజరాత్, దక్షిణ గుజరాత్‌లో చివరి రెండు ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉందని రెండు నెలల క్రితం అంచనావేశారు. అయితే ఈ రెండు చోట్ల కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా ఉన్నట్టు కనిపిస్తోందని తాజా సీఎస్‌డీఎస్ సర్వే చెబుతోంది. వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నివసించే పారిశ్రామిక నగరం సూరత్ బీజేపీకి కంచుకోటగా ఉండేది. ఇక్కడ కూడా అనేక చిన్న పరిశ్రమలు ఇటీవల మూతబడడంతో శ్రామికవర్గంతో పాటు ఫ్యాక్టరీ యజమానుల్లో కూడా పాలపపక్షంపై అసంతృప్తి వ్యక్తమౌతోంది.
మారుతున్న సర్వేల అంచనాలు!
ఈ నెల 9, 14న పోలింగ్ జరిగే ఈ రాష్ట్రంలో ఆగస్ట్‌లో జరిపిన ఎన్నికల సర్వేలన్నీ పాలకపక్షమైన బీజేపీ గెలుపు నల్లేరుపై బండి అనేలా జోస్యం చెప్పాయి. అధికారానికి అందనంత దూరంలో కాంగ్రెస్ ఉందని లెక్కలేసి వివరించాయి. ఇప్పుడు మొదటి దశ పోలింగ్‌కు ఒక రోజు ముందు గుజరాతీల ఆలోచనలు కాషాయపక్షానికి అంత అనుకూలంగా ఉన్నట్టు కనిపించడం లేదు. తొలి సర్వే తర్వాత వరుసగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ చివరి వారంలో జరిపిన సర్వేల్లో కాంగ్రెస్‌కు మెజారిటీకి అవసరమైన సీట్లు వస్తాయనే సూచనలు లేకున్నా, బలం మాత్రం క్రమేపీ పుంజుకుంటున్నట్టు వెల్లడవుతోంది.
సీఎస్‌డీఎస్ నిర్వహించిన మొదటి, చివరి సర్వేల ఫలితాలు పరిశీలిస్తే ఆగస్ట్‌లో కాంగ్రెస్‌కు కేవలం 29 శాతం లభించగా, అవి చివరి సర్వేనాటికి 14 శాతం పెరిగి 43 శాతానికి చేరుకున్నాయి. అలాగే బీజేపీ ఓట్ల వాటా 59 శాతం నుంచి నవంబర్‌కు 16 శాతం తరిగి 43 శాతానికి పడిపోయాయి. అంటే రెండు పార్టీలకు తాజా సర్వేలో ఓట్ల వాటా సమానంగా ఉందనీ, దీన్ని సీట్లలోకి మార్చితే బీజేపీకి ఎక్కువ సీట్లు దక్కుతాయని భావించవచ్చని సీఎస్‌డీఎస్ తన నివేదికలో విశ్లేషించింది. బీజేపీకి 91-99 మధ్య, కాంగ్రెస్‌కు 78-86 మధ్య సీట్ల దక్కవచ్చని అంచనావేసింది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్‌లో సాధారణ మెజారిటీకి 92 సీట్లు అవసరం. ఈ నెల 18న జరిగే ఓట్ల లెక్కింపులో విజేత ఎవరైనా కాంగ్రెస్‌కు, వచ్చే వారం అధ్యక్షపదవి చేపట్టే రాహుల్‌గాంధీకి కాస్త ప్రాణవాయువు అందించేలా కనిపిస్తోంది.
‘సమూహాల’ను ఓట్లుగా మార్చలేకపోతున్న రాహుల్: టైమ్స్‌నౌ సర్వే
రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్, ఆయనకు మద్దతు పలికిన కుల సంఘాల నేతలు తమ సభలకు వచ్చిన జనసమూహాలను ‘ఓట్లు’గా మార్చడంలో విఫలమయ్యారని టైమ్స్‌నౌ-వీఎంఆర్ తాజా సర్వేలో తేలింది. ఈ కారణంగా కాంగ్రెస్‌కు వచ్చే సీట్లు స్వల్పంగానే (61 నుంచి 63-73 సీట్లకు) పెరగవచ్చని ఈ సర్వే అంచనావేస్తోంది. మూడు విభిన్న సామాజికవర్గాల (పటేళ్లు, బీసీల్లోని క్షత్రియులు, దళితులు) నేతలైన హార్దిక్‌పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవానీలు పరస్పర విరుద్ధమైన తమ ప్రయోజనాలకే ప్రాథాన్యం ఇవ్వడంతో ఈ కులాల తాజా కలయిక కాంగ్రెస్‌కు ఉపయోగపడలేదని కూడా టైమ్స్‌నౌ సర్వే విశ్లేషణలో స్పష్టమౌతోంది. రాహుల్‌పై వివాదాల రూపంలో బీజేపీ క్రమం తప్పకుండా సాగిస్తున్న దాడులను సమర్ధంగా తిప్పికొట్టడంలో కాంగ్రెస్ నేతలు విఫలమౌతున్నారు.
రాహుల్ మినహా కాంగ్రెస్ బడా నేతలెవరూ గుజరాత్ ప్రచారంలో చురుకుగా ప్రచారం చేయకపోవడం కూడా 132 ఏళ్ల పార్టీలో ప్రధాన లోపంగా కనిపిస్తోంది. రెండో దశ ప్రచారంలోనైనా ఈ లోటుపాట్లను కాంగ్రెస్ సరిదిద్దుకుంటే సీట్ల సంఖ్య మరింత పెంచుకునే అవకాశం ఉంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 71.32 శాతం రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. బీజేపీకి 116, కాంగ్రెస్‌కు 60 సీట్లు లభించాయి. ఈసారి కూడా పోలింగ్ శాతం బాగుంటే కమలానికే ప్రయోజనకరమని భావిస్తున్నారు. నరేంద్రమోదీ సర్కారు అమలు చేసిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఇబ్బందిపడిన వ్యాపారవర్గాలు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసినా పెద్దనష్టముండదని పాలకపక్షం భావిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆర్థికాభివృద్ధిలో ఎప్పుడూ ముందుండే గుజరాత్‌లో సామాన్య ప్రజానీకం భిన్నంగా ఆలోచిస్తారని చెబుతున్నారు. ఇండియాకు, గుజరాత్‌కు మేలుచేసేది బీజేపీ, మోదీయేనని నమ్మే గుజరాతీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారని బీజేపీ నేతలు అంచనావేస్తున్నారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment