
విశ్వహిందూ పరిషత్ చీఫ్, ప్రవీణ్ తొగాడియా (ఫైల్ ఫొటో)
సాక్షి, సూరత్ : విశ్వహిందూ పరిషత్ చీఫ్ ప్రవీణ్ తొగాడియా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఓ ట్రక్కు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం వెళ్లి డివైడర్‌ను తాకింది. ఈ క్రమంలో ఆ ట్రక్కు వాహనం డ్రైవర్ ఎలాంటి బ్రేకులు వేయలేదంట. అయితే, అదృష్టవశాత్తు తొగాడియా, ఆయన అనుచరులకు ఎలాంటి హానీ జరగలేదు. ఈ ఘటనపై స్పందించిన తొగాడియా గుజరాత్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై ప్రభుత్వం హత్యాయత్నానికి ప్రయత్నించిందని అన్నారు.
తన వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత కూడా ఎందుకు బ్రేకులు వేయలేదని ప్రశ్నించారు. తాను ఆసమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో లేకుంటే తన సిబ్బందితో సహా ఎవరూ ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఉద్దేశ పూర్వకంగానే భద్రత తగ్గిస్తూ వచ్చారని, జెడ్‌ప్లస్ కేటగిరినీ బలహీనపరుస్తూ వచ్చారని, కనీసం ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కూడా పంపించడం లేదని, ఇదంతా తనను హత్య చేసే కుట్రలో భాగమేనని అన్నారు. అయితే, పోలీసులు మాత్రం ఈ ఘటనను ఒక ప్రమాదంగానే చెబుతున్నారు. వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.