సాక్షి, అమరావతి బ్యూరో/నగరంపాలెం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన మంగళవారం ఉత్కంఠ మధ్య ముగిసింది. మంగళగిరి, మాచర్ల నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లలో లోపాలపై ఫిర్యాదులు అందడంతో ఉత్కఠ నెలకొంది. గుంటూరు, బాపట్ల, నరసరావుపేట పార్లమెంట్ స్థానాలకు 38 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. మూడు పార్లమెంట్‌స్థానాలకు 14 నామినేషన్లను తిరస్కరించగా, 48 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. 17 అసెంబ్లీ స్థానాలకు 65 నామినేషన్లను తిరస్కరించి, 317 ఆమోదించారు.
ఉత్కంఠ నడుమ ఆమోదం
మంగళగిరి, మాచర్ల నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు లోకేష్‌బాబు, అంజిరెడ్డి నామినేషన్‌లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) ఫిర్యాదు చేయడంతో ఉత్కంఠత నెలకొంది. మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన లోకేష్ తన ఇంటి చిరునామా తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామంగా పేర్కొన్నారు. అయితే నోటరీ చేసింది మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన లాయర్ సీతారామ్, కొంగర సాయి. వారు గుంటూరు జిల్లా పరిధిలోకి రారని, అలాంటప్పుడు ఎలా నోటరీ చేస్తారని ప్రశ్నించడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆర్కే ప్రశ్నించారు. మాచర్లలో సైతం టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డి మాచర్ల ప్రాంతానికి కాకుండా గురజాలకు చెందిన న్యాయవాదితో నోటరీ చేయించారని, అది చెల్లదని పీఆర్కే వాదించారు.
కొద్ది గంటల అనంతరం ఆ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. పెదకూరపాడులో ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్ వేసిన నంబూరు శంకరరావు నామినేషన్‌ను తిరస్కరించారు. చిలకలూరిపేట నూతక్కి రేఖ, నరసరావుపేట తలారి నాని నామినేషన్లను తిరస్కరించారు. వినుకొండ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గంగినేని బ్రహ్మనాయుడు నామినేషన్ వేశారు. అయితే టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లు గలిగినవారితో కుట్ర పూరితంగా ప్రజా శాంతి పార్టీ, తెలుగుదేశం పార్టీతో నామినేషన్లు వేయడం గమనార్హం. బాపట్లలో ఇద్దరు అభ్యర్థులకు జనసేన బీపారాలు ఇవ్వగా, ఇక్కుర్తి నరసింహారావు, పునుగు మధుసూదన్‌రెడ్డికి బీఫారాలు ఇచ్చారు. వారిలో చివరకు పార్టీ ఇక్కుర్తి నరసింహారావు బీఫారాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పునుగు మధుసూదన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట పార్లమెంట్‌కు షేక్ చాంద్‌బాషా, యర్రా ప్రవీణ్‌కుమార్ ఇద్దరు ప్రశాంతి పార్టీ తరఫున నామినేషన్‌లు వేయగా ఇద్దరివి తిరస్కరించారు. ప్రధాన పార్టీలకు చెందిన నామినేషన్‌లను మాత్రం తిరస్కరణకు గురి కాలేదు.
టీడీపీ అభ్యర్థి నామినేషన్‌పై అభ్యంతరాలు
మాచర్లరూరల్: మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ డేవిడ్‌రాజు సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. మొత్తం 18 నామినేషన్లు అందగా, నవక్రాంతి పార్టీ అభ్యర్థి నారె వేములయ్య నామినేషన్‌కు ప్రపోజల్స్ సంఖ్య సరిపడినంత లేకపోవటంతో తిరస్కరించారు. టీడీపీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డి నామినేషన్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో పరిశీలన కార్యక్రమం మూడు గంటలపాటు నిలిచిపోయింది. అంజిరెడ్డి నామినేషన్ పత్రంలో నోటరీకి జతపరచిన ప్రమాణ పత్రంలో నోటరీ ఎదుట ప్రమాణం చేసినట్లు ఉండాల్సిన కాలం ఖాళీగా ఉండటంతో న్యాయవాది బాల సత్యనారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
నోటరీ పత్రం జారీ చేసిన అడ్వకేట్ గురజాల మేజిస్ట్రేట్ పరిధికి చెందిన వారు కావటం, మాచర్ల నియోజకవర్గానికి ఆయన ఇచ్చిన నోటరీ చెల్లదని సత్యనారాయణరెడ్డి రిటర్నింగ్ ఆఫీసర్ డేవిడ్‌రాజు ఎదుట అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ నామినేషన్‌ను తిరస్కరించాలని పట్టుబట్టారు. దీంతో మూడు గంటల పాటు పరిశీలన ఆగిపోయింది. అనంతరం చిన్నచిన్న అభ్యంతరాలు ఎన్ని కల కమిషన్ పరిధిలోకి రావంటూ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్‌ను ఆమోదించడంతో న్యాయవాది సత్యనారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, కోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. పరిశీలన అనంతరం 15 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
9 మంది అభ్యర్థులు తిరస్కరణ
పెదకూరపాడు: పెదకూరపాడు నియోజకవర్గంలో ఆసెంబ్లీ స్థానానికి 20 మంది నామినేషన్లు సమర్పించగా, 9 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు, టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్, జనసేన పార్టీ అభ్యర్థి పుట్టి లక్ష్మీసాంమ్రాజ్యం, బీజేపీ అభ్యర్థి గంధం కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పమిడి నాగేశ్వరరావు తదితరుల నామినేషన్లు ఆమోదం పొందాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు పేరుతో ఉన్న వ్యక్తితో ప్రజాశాంతి పార్టీ తరఫున అందిన నామినేషన్‌ను సక్రమంగా పూర్తిచేయకపోవడంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో టీడీపీ కుట్రకు చెక్ పెట్టినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment