నంద్యాల బరిలో అత్యధికంగా..! | 20 Independent Candidates in Nandyala | Sakshi
Sakshi News home page

నంద్యాల బరిలో అత్యధికంగా 20 మంది!

Published Fri, Apr 5 2019 11:10 AM | Last Updated on Fri, Apr 5 2019 11:47 AM

20 Independent Candidates in Nandyala - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాల ఎన్నికలకు 344 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో రెండు పార్లమెంటు స్థానాలున్న కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 36 మంది పోటీలో నిలిచారు. అత్యధికంగా నంద్యాల పార్లమెంటు సీటు నుంచి 20 మంది అభ్యర్థులు పోటీలో నిలుచున్నారు. తర్వాత 19 మంది బరిలో నిలుచోవడం ద్వారా గుంటూరు పార్లమెంటు రెండో స్థానం, 16 మందితో కర్నూలు మూడో స్థానంలో ఉన్నాయి. అత్యల్పంగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి 8 మంది మాత్రమే బరిలో ఉన్నారు. హిందూపురం, రాజంపేట, శ్రీకాకుళం స్థానాల్లో తొమ్మిది మంది చొప్పున అభ్యర్థులు ఉన్నారు. మిగిలిన స్థానాల్లో పది మందికి తక్కువ కాకుండా స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

ఇక్కడ రెండు ఈవీఎంలు వాడాల్సిందే.. 
ఒక్క ఈవీఎం మిషన్లో (బ్యాలెట్‌ యూనిట్‌) గరిష్టంగా 16 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే పడతాయి. నోటా గుర్తును పరిగణనలోకి తీసుకుంటే 15 మంది అభ్యర్థులు దాటితే అదనపు ఈవీఎంలు వినియోగించాల్సి వస్తుంది. ప్రస్తుతం పార్లమెంటు సీట్లల్లో బరిలో నిలుచున్న అభ్యర్థుల ప్రకారం నంద్యాల (20), గుంటూరు (19), కర్నూలు (16) సీట్లలో 15కు మించి అభ్యర్థులు బరిలో ఉండటంతో ఇక్కడ రెండు ఈవీఎంలు వినియోగించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఏకంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో అక్కడ ఏకంగా 12 ఈవీఎంలు వినియోగిస్తున్నారు. 

తగ్గిన స్వతంత్రుల సందడి 
ఈసారి చాలా పార్లమెంటు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థుల సందడి తక్కువగా ఉంది. 5 ప్రధాన పార్టీలు వైఎస్సార్‌ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేనలతో పాటు ఇతర నమోదిత పార్టీలు అనేకం పోటీలో ఉండటంతో స్వతంత్ర అభ్యర్థులు తక్కువగా పోటీలో ఉండటానికి కారణంగా రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు 95 మంది స్వతంత్రులు మాత్రమే పోటీలో ఉన్నారు. అనకాపల్లి, అమలాపురం పార్లమెంటు స్థానాల్లో ఒకే ఒక స్వతంత్ర అభ్యర్థి రంగంలో నిలుచున్నారు. రాజమండ్రి, ఏలూరు, రాజంపేట, చిత్తూరు నియోజకవర్గాల నుంచి ఇద్దరు చొప్పున మాత్రమే రంగంలో నిలుచున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement