సాక్షి, గుంటూరు : గత 60 ఏళ్ళలో జరగని అభివృద్ధిని ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్లలో చేసి చూపించారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమ పార్టీకి మరోసారి అధికారాన్ని కట్టబెట్టాయని పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో నడిచిందని విమర్శించారు. కేవలం కేంద్రంపై అభాండాలు వేయడం కోసమే వారు సమయం కేటాయించారన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కేవలం మీడియాలో మాత్రమే కనబడిందని ఎద్దేవా చేశారు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. రైతులకు పింఛన్లు, దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటికి పైపుల ద్వారా మంచి నీటిని ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందన్నారు.
అందుకే బిల్లులు నిలిచిపోయాయి..
రాజ్యసభలో రాజ్యసభలో బీజేపీకి సరిపడా బలం లేకపోవడం వల్ల చాలా బిల్లులు నిలిచిపోయాయని జీవీఎల్ తెలిపారు. అయితే ఇప్పుడు పెద్దల సభలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతోందని.. 2022 నాటికి ఎన్డీయేకు పూర్తి స్థాయి సంఖ్యా బలం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చట్టసభలలో అల్లర్లు చేసి, బిల్లులను అడ్డుకున్న పార్టీలు ప్రజా క్షేత్రంలో ఘోరంగా దెబ్బతిన్నాయని ఎద్దేవా చేశారు. 2024లో కూడా అత్యధిక మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఆరు నెలల నుంచి ఏడాది లోపు ఏపీలో పూర్తి స్థాయిలో తాము బలపడతామని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీలో చేరినప్పటికీ నాయకులపై ఉన్న అభియోగాలను వారు ఎదుర్కోవాల్సిందేనని తాజాగా బీజేపీలో చేరిన ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment