
న్యూఢిల్లీ: రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని.. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధాని మార్పుతో కేంద్రం ఎవరితోనూ ఎటువంటి సమావేశం జరపడం లేదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జనసేన పార్టీతో రేపటి సమావేశం కేవలం సమన్వయ కమిటీ సభ్యుల ఎంపిక కోసం మాత్రమే నని పేర్కొన్నారు. రాజధాని అంశంతో ఈ సమావేశానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చిస్తామని తెలిపారు రాజధాని కోసమే రేపు జనసేనతో సమావేశం అన్నది పూర్తిగా అవాస్తమని వెల్లడించారు. అయితే కొన్ని మీడియాలు దురుద్దేశపూర్వకంగానే తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు.. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు ఢిల్లీలోనే సమావేశాలు నిర్వహించుకుంటామని జీవీఎల్ తెలిపారు.(మొదటి ముద్దాయి చంద్రబాబు: జీవీఎల్ )
కాగా రాష్ట్రంలో బీజేపీ- జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా... జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన భావజాలం ఒక్కటేనని ఉద్ఘాటించారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి బీజేపీ నేతల వివరించిన తీరు తనను ఆకట్టుకుందని తెలిపారు. ఇక గతంలో పవన్.. బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలతో కలసి పనిచేసిన సంగతి తెలిసిందే. కాగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.... అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. విశాఖపట్నం పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అదే విధంగా సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును కూడా ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment