సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసైనా తన రాజకీయ ప్రత్యర్థి జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి మోదీని కోరినా స్పందించలేదు కాబట్టే తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి వైదొలిగింది నిజం కాదా? అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి బుధవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని మోదీ కాపాడుతున్నారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికి అవినీతి పరులెవ్వరినీ కాపాడాలని ఉండదు, అదే సమయంలో అవినీతి పేరుతో ఎవరినీ టార్గెట్ చేసే పరిస్థితి లేదన్నారు. ఈ ఎన్నికల సమయంలో తుపాను మాదిరి టీడీపీ నేతలు వేరే పార్టీకి వలసవెళ్తున్నందున చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కేసులను విచారణ చేసిన అధికారులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని.. వారి అనుబంధం బయటపడుతుందనే భయంతో కేంద్రంలోని మోదీ, బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఈ కేసులపై విచారణ జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబుల మధ్య అనుబంధం ఏంటో తేలాల్సి ఉందన్నారు. సీబీఐని కేంద్రం దుర్వినియోగం చేస్తుందని చంద్రబాబు ఆరోపిస్తాడు గానీ, సీబీఐ అంటే ‘చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అని ఎద్దేవా చేశారు. అప్పట్లో ఆయన చెప్పిన పనిచేసిన సీబీఐ ఇప్పుడు స్వతంత్రప్రతిపత్తిగా పనిచేస్తోందన్నారు. ఇతరులపై చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తారు గానీ, ఆయన చేసిన అవినీతి చూసి రాష్ట్ర ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. రాజధాని, విశాఖపట్నం భూములతో పాటు, భోగాపురం ఎయిర్‌పోర్టు, మచిలీపట్నం, కాకినాడ సెజ్‌ల పేరుతో వేల ఎకరాల భూములను దోచుకున్న చంద్రబాబును ఇప్పుడు ప్రజలెవరూ నమ్మడం లేదని.. దోచుకున్న డబ్బులతో ఇప్పుడు అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారని తూర్పారపట్టారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీ అభ్యర్థులంటే పన్ను ఎగవేతదారులు, ఈడీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, దొంగ వ్యాపారాలు చేసే వారు, భూకబ్జాదారులేనని దుయ్యబట్టారు.
ఓటుకు కోట్లు కేసు రాజీ చేసిందెవరు?
సీఎం చంద్రబాబు అనేక అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకొన్నారని, ఆయన స్టేలో కొనసాగుతున్న ఏ కేసు గురించైనా కేంద్ర ప్రభుత్వం మాట్లాడిందా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్థత ఉందని, ఆయన అన్ని వ్యవస్థలనూ నాశనం చేస్తూ కేంద్రంపైనా, బీజేపీపైనా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఇంకొకరిపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో ఎవరితో రాజీ చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్‌పై కక్ష సాధింపు చర్యలు చేయలేదనే!
Published Thu, Mar 14 2019 5:05 AM | Last Updated on Thu, Mar 14 2019 5:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment