సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఇప్పటికే పలుమార్లు నాలుక మడతేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీని తీసుకోవడానికి చంద్రబాబు అంగీకారం తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.12,072 కోట్ల విలువ చేసే ఐదు ప్రాజెక్టుల కోసం తీసుకునే రుణాన్ని, దానిపై వడ్డీని కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరారు. ఈ మేరకు మే 30వ తేదీన ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌తో కేంద్రానికి లేఖ రాయించారు. ఈ లేఖను తాజాగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బయట పెట్టారు. ప్రత్యేక హోదా సాధన పోరాటం పేరిట కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగిన తర్వాత ఈ లేఖ రాయడం గమనార్హం. అంటే ప్రత్యేక హోదా ఉద్యమం పేరిట టీడీపీ సాగిస్తున్నదంతా ఉత్త నాటకమేనని, ప్రత్యేక ప్యాకేజీ కోసమే తహతహలాడుతున్నట్లు తేటతెల్లమవుతోంది.
ఇక్కడ దీక్షలు.. అక్కడ లేఖలు
ప్రత్యేక హోదా పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొంగ దీక్షలు చేస్తూ రకరకాల డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మండిపడ్డారు. మరోవైపు ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ నిధులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పేరుతో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయించారని చెప్పారు. నరసింహారావు మంగళవారం బీజేపీ నేతలతో కలిసి విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇస్తామన్న నిధులను తీసుకోవడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఈ ఏడాది మే 30న కేంద్రానికి రాసిన లేఖ ప్రతులను ఆయన మీడియాకు విడుదల చేశారు. ‘‘ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.12,072 కోట్ల విలువ చేసే ఐదు ప్రాజెక్టులను రాష్ట్రానికి ఇస్తున్నారు. దీనిపై కొంత వడ్డీ భారం మాపై పడుతుంది. అది మీరే చెల్లించాలి. ఆ రుణాన్ని కూడా మొత్తం మీరే చెల్లించేలా ఒప్పందం జరిగింది. ఇదే విషయాన్ని రుణం అందజేసే సంస్థలకు తెలియజేయండి’’ అని కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఇక్కడ దొంగ దీక్షలు చేస్తూ.. అక్కడ(ఢిల్లీలో) ఎవరికీ తెలియకుండా ప్రత్యేక ప్యాకేజీ నిధుల కోసం లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రమిచ్చే నిధులు తీసుకోవడం మంచిదేనని చెప్పారు. కేంద్రం నుంచి నిధులను గుప్తంగా తీసుకోవాలన్నది చంద్రబాబు ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
సీఎంకు విశ్వసనీయత ఉందా?
ప్రత్యేక హోదా అడిగే వారు, దాని గురించి మాట్లాడుతున్న వారు ఇకపై ముందుగా చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేయాలని జీవీఎల్ నరసింహారావు సూచించారు. డ్రామాలు ఇప్పటికైనా ఆపాలని చంద్రబాబుకు సూచించాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీ బాగుందని ఒకసారి.. ప్యాకేజీ తీసుకోవడం లేదు, ప్రత్యేక హోదా కావాలని మరోసారి అబద్ధాలు చెప్పి ఇప్పుడు చక్కగా ప్యాకేజీ నిధులను తెచ్చుకుంటూ చంద్రబాబు బాగా డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే ఇలా నాటకాలు ఆడడం రాష్ట్ర ప్రజలను వంచించడం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తామన్న ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని నమ్మబలుకుతున్న ముఖ్యమంత్రికి విశ్వసనీయత ఉందా? అని నిలదీశారు. ఇప్పుడు తీసుకుంటున్న రూ.12,072 కోట్ల విలువ చేసే ఐదు ప్రాజెక్టులే కాకుండా, రూ.17,236 కోట్ల విలువ చేసే మరో ఏడు ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కమీషన్లు వచ్చే పనులకే బాబు అంగీకారం
సీఎం చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధికి అడ్డు పడుతున్నారని జీవీఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. తనకు కమీషన్లు వచ్చే అభివృద్ధి పనులకు మాత్రమే అంగీకారం తెలుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా కేంద్రం నిధులు విడుదల చేస్తోందన్నారు. సాగరమాల పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా 504 ప్రాజెక్టులను మంజూరు చేస్తే, మన రాష్ట్రానికే 104 ప్రాజెక్టులు మంజూరు చేసిందన్నారు. దేశంలో మిగిలిన రాష్ట్రాలన్నంటికీ కేంద్రం 5 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, ఆంధ్రప్రదేశ్‌కు 7 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులిస్తుండగా, చంద్రబాబు తన సొంత జెండాలతోప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
‘బ్రోకర్లను పంపవద్దని లోకేశ్‌తో కేంద్ర మంత్రే చెప్పారు’
రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని కదిపినా చంద్రబాబు ప్రభుత్వ అవినీతి గురించి కథలు కథలుగా చెబుతారని జీవీఎల్ పేర్కొన్నారు. రాష్ట్రానికి నాలుగేళ్లగా చంద్ర గ్రహణం పట్టిందన్నారు. టీడీపీతో కలిసి ఉండడం వల్ల రాష్ట్రంలో తమ పార్టీ చాలా కోల్పోయిందని అన్నారు. రాజకీయ బ్రోకర్లు, కాంట్రాక్టర్ బ్రోకర్లను ఏదో ఒక పని పేరుతో తరచూ తన వద్దకు పంపవద్దంటూ ఒక కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు స్వయంగా చెప్పారంటే రాష్ట్రంలో అవినీతి విలయ తాండవాన్ని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. సొంత పనుల కోసం వచ్చే బ్రోకర్లను తన వద్దకు పంపవద్దని లోకేశ్‌కు కేంద్ర మంత్రి చెప్పారని గుర్తుచేశారు. టీడీపీకి చెందిన ప్రతి వెధవ తమను భయపెట్టాలనుకుంటున్నారని, తాము భయపడే ప్రసక్తే లేదని నరసింహారావు తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment