సొమ్మసిల్లి పడిపోయిన చండ్రాయుడును ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
సాక్షి,ధర్మవరం టౌన్: ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని కేతిరెడ్డి కాలనీకి చెందిన చండ్రాయుడు(74) భార్య నరసమ్మతో కలసి గురువారం ఇందిరమ్మ కాలనీ వద్దనున్న పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చాడు. జనం ఎక్కువగా ఉండటం...అధికారులు కనీస సౌకర్యాలు కల్పించక పోవడంతో క్యూలోనే గంటల తరబడి వేచి ఉన్నాడు.
కనీసం తాగేందుకు మంచినీరు, షామియానాలు కూడా సమకూర్చకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈక్రమంలోనే ఎలాగోలా లోనికి వెళ్లి ఓటు వేసిన చంద్రాయుడు తిరిగి వస్తూ పోలింగ్ కేంద్రం వద్దనే కుప్పకూలాడు. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. కాగా ఇంటి పెద్ద మరణంతో ఆ కుటుంబం దిక్కులేనిది అయ్యింది. మృతదేహం వద్ద భార్య రోధనలు అందరిని కలచివేశాయి.
Comments
Please login to add a commentAdd a comment