handicraft
-
ఉద్యోగం కోల్పోతేనేం కుట్టు పనితో ఏకంగా..!
‘చేతిలో విద్య ఉంటే ఎడారిలో కూడా బతికేయవచ్చు’ అంటారు పెద్దలు. ఉద్యోగం కోల్పోయిన మంజూషకు కుట్టుపని బాగా తెలుసు. ఆ విద్యతో అతి తక్కువ పెట్టుబడితో ఫ్యాబ్రిక్ డిజైన్లకు సంబంధించిన ‘తోఫా’ బ్రాండ్‌కు శ్రీకారం చుట్టింది ముంబైకి చెందిన మంజూష ఆ బ్రాండ్ ద్వారా ఇప్పుడు లక్షలు అర్జించే స్థాయికి ఎదిగింది. ఎంతోమంది మహిళలకు ఉపాధి ఇస్తోంది.యాభై రెండేళ్ల వయసులో మంజూష ఉద్యోగం కోల్పోయింది. బతకడానికి, కుమార్తెను చదివించడానికి మరో ఉద్యోగం వెదుక్కోక తప్పని పరిస్థితి. ‘ఈ వయసులో నాకు ఉద్యోగం ఎవరు ఇస్తారు?’ అనుకుంది. అయితే మంజూషకు ఒక లా కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రోజూ గంటల తరబడి ప్రయాణం చేసి ఆఫీసుకు వెళ్లాలి. నీరసంగా ఉండేది, నిస్పృహగా ఉండేది. అయినప్పటికీ ‘ఇల్లు గడుస్తుందిలే’ అనే చిన్న సంతృప్తితో ఉద్యోగం చేసేది.కొన్నిసార్లు ఉద్యోగం మానెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చేది. ఇంతలో కూతురు చదువు గుర్తుకు వచ్చి తన నిర్ణయాన్ని మార్చుకునేది. తల్లి మౌనవేదనను గమనించిన కూతురు ఆమెతో వివరంగా మాట్లాడింది. ‘నాకు ఉద్యోగం చేయాలని లేదు. కానీ తప్పదు’ అన్నది మంజూష. ‘ఉద్యోగం లేకుండా బతకలేమా!’ అన్నది కూతురు నజూక. ‘ఎలా?!’ అన్నది తల్లి.‘కుట్లు అల్లికలు నీ హాబీ. మనం హాయిగా బతకడానికి ఈ విద్య చాలు’ అన్నది నజూక ఆత్మవిశ్వాసంతో. ఇంటిలో ఒక మూలన వన్స్ అపసాన్ ఏ టైమ్ కుట్టుమిషన్ ఉంది. ‘నీ కూతురు చెప్పింది నిజమే. ముందుకు వెళ్లు’ అన్నట్లుగా అభయం ఇచ్చింది ఆ పాత కుట్టు మిషన్.కుమార్తె నజుకా జేవియర్‌తో కలిసి ‘తోఫా’కు శ్రీకారం చుట్టింది మంజూష. ‘ఒకవేళ ఈ వ్యాపారంలో విఫలమైతే! ఏదో ఒక ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుందా....’ ఇలా రకరకాల సందేహాలు వచ్చేవి మంజూషకు. అయితే ఒక్కసారి పనిలో మునిగి΄ోయాక ఆ సందేహాలు దూరం అయ్యేవి. ఎంతో ధైర్యం వచ్చేది.చెన్నైలో జరిగిన ఎగ్జిబిషన్లో పాల్గొన్న తరువాత తనపై తనకు ఎంతో నమ్మకం వచ్చింది. ఇంటి అలంకరణలు, ఫ్యాబ్రిక్ డిజైన్లకు సంబంధించి తన బ్రాండ్‌కు అక్కడ మంచి స్పందన వచ్చింది. రెండు వేల రూపాయల పెట్టుబడితో మొదలు పెట్టిన ఈ బ్రాండ్ ఇప్పుడు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తోంది.‘సొంతంగా ఏదో ఒకటి చేయాలని ఎప్పటినుంచో అనుకునేదాన్ని. కాని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయాను. మరిచిపోయాను అనుకున్న కళ మళ్లీ నా దగ్గరకు వచ్చింది. కుట్టుపని నాలో ఆత్మవిశ్వాసాన్ని, నా జీవితంలో వెలుగుల్ని నింపింది’ అంటుంది మంజూష.మార్కెంటింగ్‌లో పట్టా పుచ్చుకున్న కూతురు నజూక బ్రాండ్ రూపకల్పనలో, విజయవంతం చేయడంలో తల్లికి సహాయం అందించింది. ‘అమ్మ దుబారా ఖర్చు చేసేది కాదు. పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చేది. చిన్నప్పుడు నాకోసం బట్టలు కొనేది కాదు. పాత చీరలు, ఇతర దుస్తుల నుంచి నాకు అందమైన డ్రెస్‌లు కుట్టేది. అప్పటి ఆ విద్య వృథా పోలేదు. మాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది’ అంటుంది నజూక.‘కుమార్తె రూపంలో యువతరంతో కనెక్ట్ కావడం వల్ల ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను. అప్డేట్ అయ్యాను. మా వ్యాపారంలో ఇప్పటి వరకు ప్లాస్టిక్ వాడలేదు’ అంటుంది మంజూష. ‘తోఫా’ ద్వారా తాను ఉపాధి పొందడమే కాదు ఎంతోమంది చేతివృత్తి కళాకారులకు ఉపాధిని ఇస్తోంది మంజూష. వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకుంటున్న మహిళలను ఉద్దేశించి... ‘భయం, సందేహాలు ఎప్పుడూ ఉండేవే. అయితే అవి మన దారికి అడ్డుపడకుండా చూసుకోవాలి’ అంటుంది.(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది సిగరెట్ అంటించకండి!) -
‘వెంకటగిరి’ ఉత్పత్తులు అత్యద్భుతం
సైదాపురం/వెంకటగిరి రూరల్: వెంకటగిరి నేతన్నలు తయారు చేసిన పలు అద్భుతమైన డిజైన్లు అబ్బురపరుస్తున్నాయని ఇన్వెస్ట్ ఇండియా టీమ్ కమిటీ ప్రతినిధులు కితాబిచ్చారు. వెంకటగిరి చీరలు, చేనేత ఉత్పత్తులు, జరీ తదితర ఉత్పత్తులను మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది. ఓపెన్ ఇండియా ఒన్ ప్రొడెక్ట్ అవార్డులో భాగంగా 2023లో ప్రతిష్టాత్మకంగా జరిగే పోటీల్లో వెంకటగిరి చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చారు. ఈ మేరకు ఇన్వెస్ట్ ఇండియా టీమ్ కమిటీ ప్రతినిధి జగీష్ తివారిమిశ్రా, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డితో కలిసి వెంకటగిరిలో తయారు చేసే పలు చేనేత ఉత్పత్తులు, చీరలు, డిజైన్లను పరిశీలించారు. కేంద్ర బృందానికి వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్వాగతం పలికారు. పట్టణంలోని సాలి కాలనీలోని టాటాట్రస్ట్ అంతరాన్ అందిస్తున్న సహకారం, నేతన్నల వృత్తిలో నైపుణ్యం వంటి అంశాలపై ఆరాతీశారు. బంగారుపేటలో రాష్ట్రపతి చేనేత అవార్డు గ్రహీతలు కూనా మల్లికార్జున్. గౌరవబత్తిన రమణయ్య నివాసాల వద్ద జందాని ట్రెడిషన్ రంగంలో తయారు చేసిన చీరలు, చీరలపై తెలుగు సంప్రదాయల కళ ఉట్టిపడేలా తయారు చేసిన డిజైన్లపై ఆరాతీశారు. వెంకటగిరి రాజా కాలంలో వెంకటగిరి జరీ చీరల ప్రత్యేకతపై వివరాలు తెలుసుకున్నారు. రాజరాజేశ్వరి చేనేత సహకారం సంఘాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వెంకటగిరిలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి నక్కా వెంకటరమణయ్య అండ్ సన్స్ వద్దకు వెళ్లి తయారీ విక్రయానికి సిద్ధంగా ఉన్న పట్టు చీరలను పరిశీలించారు.అలాగే ప్రసిద్ధి చెందిన ఐఐహెచ్‌టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ) కళాశాలను కేంద్ర బృందం ప్రతినిధి జిగీష తివారి మిశ్రా పరిశీలించారు. -
పనులు ప్రారంభమయ్యాయి కానీ..
న్యూఢిల్లీ: సోమవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ 3.0 ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా జోన్ల వారీగా మినహాయింపులు ఇచ్చిన నేపథ్యంలో.. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఇతర పలు చేతి వృత్తుల నిపుణులు తమ పనులు ప్రారంభించారు. ముఖ్యంగా, వేసవి కాలం ప్రారంభమై, భానుడు ప్రతాపం చూపుతుండటంతో ఏసీలు, కూలర్ల సర్వీసింగ్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. మరోవైపు లాక్ డౌన్ కారణంగా దాదాపు నెలన్నరగా వాయిదా పడిన గృహ సంబంధ పనులన్నీ ఒక్కటొక్కటిగా పూర్తి చేసుకునేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారు. పనులు చేసుకునేందుకు అనుమతిన్విడమే కాకుండా.. సంబంధిత స్పేర్ సామాన్లు అమ్మే షాపులు కూడా తెరిచేందుకు అనుమతినివ్వాలని ఢిల్లీకి చెందిన ఒక ఎలక్ట్రీషియన్ వ్యాఖ్యానించారు. ప్రతీ ఏప్రిల్‌లో ఏసీ రిపేర్, సర్వీసింగ్‌ల ద్వారా కనీసం రూ. 40 వేలు సంపాదించేవాడినని, ఈ సారి కరోనా కారణంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని వాపోయారు. ఢిల్లీలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు.. తదితర అసంఘటిత రంగ కార్మికులు దాదాపు 6 లక్షల వరకు ఉంటారని అంచనా. అయితే, కరోనా వ్యాప్తిపై భయాందోళనల కారణంగా చాలా మంది పౌరులు ఇంట్లో మరమ్మత్తు పనుల కోసం బయటి నుంచి ఎవరినీ పిలిచేందుకు సాహసించడం లేదు. -
పోలింగ్ కేంద్రం వద్దే చేనేత కార్మికుడి మృతి
సాక్షి,ధర్మవరం టౌన్: ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని కేతిరెడ్డి కాలనీకి చెందిన చండ్రాయుడు(74) భార్య నరసమ్మతో కలసి గురువారం ఇందిరమ్మ కాలనీ వద్దనున్న పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చాడు. జనం ఎక్కువగా ఉండటం...అధికారులు కనీస సౌకర్యాలు కల్పించక పోవడంతో క్యూలోనే గంటల తరబడి వేచి ఉన్నాడు. కనీసం తాగేందుకు మంచినీరు, షామియానాలు కూడా సమకూర్చకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈక్రమంలోనే ఎలాగోలా లోనికి వెళ్లి ఓటు వేసిన చంద్రాయుడు తిరిగి వస్తూ పోలింగ్ కేంద్రం వద్దనే కుప్పకూలాడు. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. కాగా ఇంటి పెద్ద మరణంతో ఆ కుటుంబం దిక్కులేనిది అయ్యింది. మృతదేహం వద్ద భార్య రోధనలు అందరిని కలచివేశాయి. -
అందరి బంధువయా
పట్నం తీరు గురించి నాంపల్లి స్టేషన్‌కాడ రాజలింగాన్ని అడిగితే.. ఉందామంటే నెలవే లేదు.. చేద్దామంటే కొలువే లేదని గోడు వెళ్లబోసుకుంటాడు. కళను నమ్ముకుని కలలు తీర్చుకునే దారిలో హైదరాబాద్‌కు వచ్చిన కళాకారులను ఇదే ప్రశ్న అడిగి చూడండి.. భాగ్యనగరాన్ని కళల కాణాచిగా అభివర్ణిస్తారు. పొట్టచేత పట్టుకుని ఒట్టి చేతులతో ఇక్కడకు వచ్చే వారిని సైతం ఆదరించే ఈ నగరం.. హస్తకళను పట్టుకుని వచ్చిన వారిని మాత్రం పట్టించుకోకుండా ఉంటుందా..! వారి కళకు సలామ్ చేస్తోంది. కలకాలం నిలిచేలా చేస్తుంది. ఇదే మాటను నొక్కి మరీ చెబుతున్నారు.. పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కళాకారులు. సిటీ అందరి బంధువని కొనియాడుతున్నారు. హస్తకళను నమ్ముకుని శిల్పారామం వేదికగా ఏళ్లకేళ్లుగా జీవనం సాగిస్తున్న కళాకారుల మనసులో మాట... - శిరీష చల్లపల్లి ఆదరణకు పెట్టనికోట... మాకు బతుకుదెరువు ఇచ్చింది హైదరాబాదే. 14 ఏళ్లుగా ఈ సిటీనే నమ్ముకుని నా కుటుంబాన్ని పోషిస్తున్నా. మా ఫ్యామిలీ కోల్‌కతాలోనే ఉంటుంది. నేను, మా తమ్ముడు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం. టైట బొమ్మలంటే దేశవ్యాప్తంగా మంచిపేరు ఉంది. హైదరాబాద్‌వాసులు మా బొమ్మలను ఆదరిస్తున్నారు. ఆత్మీయంగా వాళ్ల ఇళ్లలో చోటిస్తున్నారు. వాటిని చూసి బాగున్నాయని పొగుడుతుంటే హ్యాపీగా ఉంటుంది. మా కళను ఆదరిస్తున్న ఈ మహానగరం అంటే మాకెంతో అభిమానం. ఇక్కడ మా స్టాల్ అద్దె ఆరు వేల రూపాయలు. మా ఇంటి అద్దె రెండున్నర వేలు. అన్ని ఖర్చులు పోగా నెలకు రూ.15 వేలు మిగులుతోంది. ఈ మొత్తాన్ని మా ఇంటికి పంపిస్తాం. - పింటూ పురమని, కోల్‌కతా బొమ్మల కొలువు స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. చదివింది పదో తరగతే. పదేళ్ల కిందట మా ఆయనతో కలసి హైదరాబాద్ వచ్చా. మొదట్లో ప్రింటింగ్, డిజైనింగ్ చేసుకునేవాళ్లం. ఎనిమిదేళ్ల కిందట శిల్పారామంలో వండర్ డాల్స్ పేరుతో సాఫ్ట్ టాయ్స్ స్టాల్ నిర్వహిస్తున్నాం. మా దగ్గర 15 మంది పని చేస్తున్నారు. అందరూ ఆడపిల్లలే. సైడ్ పౌచెస్, టెడ్డీబేర్స్, జంతువులు, పక్షుల బొమ్మలు, ఇంటీరియర్ డెకార్స్, దేవుని ప్రతిమలు ఇలా అనేక రకాల కళాకృతులు తయారు చేస్తున్నాం. మా వ్యాపారం బాగుంది. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో మా ఉత్పత్తులు అమ్ముకునేలా ప్రాంచైజీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. - ఇందిర, కావలి బేరాలాడకుంటే... మాది ఒడిశా. బట్ట ముక్కలతో వాల్ హ్యాంగిగ్స్, కొబ్బరి పీచుతో పిచ్చుక గూడు, జంతువుల బొమ్మలు, అద్దాలతో మోడ్రన్ ఆప్లిక్, బెడ్ కవర్లు... ఇలా రకరకాల గృహాలంకరణ వస్తువులు రూపొందిస్తుంటాం. నాలుగు రోజులు 9 గంటల చొప్పున కుడితే గానీ ఒక బెడ్‌షీట్ పూర్తికాదు. మేం తిన్నా తినకపోయినా.. ఒంట్లో బాగున్నా లేకున్నా.. పని చేయాల్సిందే. 15 ఏళ్లుగా మా కుటుంబాన్ని ఆదరించిన శిల్పారామం, హైదరాబాదీలన్నా మాకు ఎనలేని గౌరవం. - శైలబాల సాహూ, ఒడిశా కశ్మీర్ కీ కథ... కశ్మీర్ నుంచి బతుకుదెరువు కోసం 11 ఏళ్ల కిందట నగరానికి వచ్చా. మా కశ్మీరీ ప్రొడక్ట్స్‌కు ఇక్కడ ఆదరణ ఎక్కువ. కలప, పేపర్ మేడ్ వస్తువులు, వాల్ హ్యాంగింగ్స్, జ్యువెలరీ బాక్సులు, బ్యాంగిల్స్, బెడ్ ల్యాంప్స్, క్యాండెల్ స్టాండ్స్ ఇలా ఎన్నో చేసి అమ్ముతుంటా. ఒక్క గాజును కశ్మీరీ డిజైన్‌లో తీర్చిదిద్దడానికి 4 గంటలు పడుతుంది. శిల్పారామంలో మా స్టాల్ ఉంది. కొండాపూర్‌లో అద్దెకుంటున్నా. నా భార్య, పిల్లలు కశ్మీర్‌లోనే ఉంటున్నారు. మూడు నెలలకోసారి మా ఇంటికి వెళ్లొస్తా. నేను అక్కడికి వెళ్లగానే నా భార్య ఇక్కడికి వస్తుంది. ఇలా కష్టపడితేగానీ పూట గడవదు. మా కష్టాన్ని గుర్తించి మాకు జీవనోపాధి కల్పిస్తున్న హైదరాబాదీలను ఎన్నటికీ మరచిపోలేను. - జావీద్, కశ్మీర్ -
సిల్వర్ ఫిలిగ్రి హస్తకళతో గణేశుడి విగ్రహం
హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవరూ తయారు చేయని అద్భుత కళాఖండాన్ని కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి సొసైటీ వారు తయారు చేశారు. వారు తయారు చేసిన ఈ కళాఖండాన్ని సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల ముందు ప్రదర్శించారు. సిల్వర్ ఫిలిగ్రి హస్తకళ విధానం 400 ఏళ్ల కిందట కరీంనగర్లో పుట్టింది. వెండి తీగలను చిన్న ,చిన్న ముక్కలుగా చేసి, సూక్ష్మ నిర్మాణ పద్దతిలో సిల్వర్ ఫిలిగ్రి గణేష్ విగ్రహాన్ని తయారుచేశారు. ఇందుకోసం ఎనిమిది మంది కళాకారులు, 18 నెలల పాటు కష్టపడ్డారు. ఒకటిన్నర అడుగుల ఎత్తు, ఒకటిన్నర అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్ర హానికి రూ. 4.50 లక్షల విలువైన వెండిని వినియోగించామని, ఇందుకోసం సొసైటీ సభ్యులందరూ చందాలు వేసుకున్నామని కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ సర్దార్ తెలిపారు. తమ కళను కాపాడుకోవడంతో పాటు కళ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకే దీనిని రూపొందించామని, త్వరలోనే శ్రీకృష్ణుని విగ్రహాన్ని తయారు చేస్తామని చెప్పారు. ఇలాంటి విగ్రహాలను ప్రపంచంలో ఎవరూ తయారు చేయలేరని ఈ సందర్భంగా చెప్పారు. గిన్నిస్ రికార్డు కోసం దరఖాస్తు చేశామని సొసైటీ సభ్యుడు రమేష్‌తో కలసి చెప్పారు.