సిల్వర్ ఫిలిగ్రి హస్తకళతో గణేశుడి విగ్రహం
హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవరూ తయారు చేయని అద్భుత కళాఖండాన్ని కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి సొసైటీ వారు తయారు చేశారు. వారు తయారు చేసిన ఈ కళాఖండాన్ని సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల ముందు ప్రదర్శించారు. సిల్వర్ ఫిలిగ్రి హస్తకళ విధానం 400 ఏళ్ల కిందట కరీంనగర్‌లో పుట్టింది. వెండి తీగలను చిన్న ,చిన్న ముక్కలుగా చేసి, సూక్ష్మ నిర్మాణ పద్దతిలో సిల్వర్ ఫిలిగ్రి గణేష్ విగ్రహాన్ని తయారుచేశారు. ఇందుకోసం ఎనిమిది మంది కళాకారులు, 18 నెలల పాటు కష్టపడ్డారు.
ఒకటిన్నర అడుగుల ఎత్తు, ఒకటిన్నర అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్ర హానికి రూ. 4.50 లక్షల విలువైన వెండిని వినియోగించామని, ఇందుకోసం సొసైటీ సభ్యులందరూ చందాలు వేసుకున్నామని కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ సర్దార్ తెలిపారు.
తమ కళను కాపాడుకోవడంతో పాటు కళ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకే దీనిని రూపొందించామని, త్వరలోనే శ్రీకృష్ణుని విగ్రహాన్ని తయారు చేస్తామని చెప్పారు. ఇలాంటి విగ్రహాలను ప్రపంచంలో ఎవరూ తయారు చేయలేరని ఈ సందర్భంగా చెప్పారు. గిన్నిస్ రికార్డు కోసం దరఖాస్తు చేశామని సొసైటీ సభ్యుడు రమేష్‌తో కలసి చెప్పారు.