ఉద్యోగం కోల్పోతేనేం కుట్టు పనితో ఏకంగా..! | Tohfa Handcrafts Luxury Sustainable And Eco Friendly Personal Use | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కోల్పోతేనేం కుట్టు పనితో ఏకంగా..!

Published Sun, Dec 8 2024 11:28 AM | Last Updated on Sun, Dec 8 2024 12:25 PM

Tohfa Handcrafts Luxury Sustainable And Eco Friendly Personal Use

‘చేతిలో విద్య ఉంటే ఎడారిలో కూడా బతికేయవచ్చు’ అంటారు పెద్దలు. ఉద్యోగం కోల్పోయిన మంజూషకు కుట్టుపని బాగా తెలుసు. ఆ విద్యతో అతి తక్కువ పెట్టుబడితో ఫ్యాబ్రిక్‌ డిజైన్‌లకు సంబంధించిన ‘తోఫా’ బ్రాండ్‌కు శ్రీకారం చుట్టింది ముంబైకి చెందిన మంజూష ఆ బ్రాండ్‌ ద్వారా ఇప్పుడు లక్షలు అర్జించే స్థాయికి ఎదిగింది. ఎంతోమంది మహిళలకు ఉపాధి ఇస్తోంది.

యాభై రెండేళ్ల వయసులో మంజూష ఉద్యోగం కోల్పోయింది. బతకడానికి, కుమార్తెను చదివించడానికి మరో ఉద్యోగం వెదుక్కోక తప్పని పరిస్థితి. ‘ఈ వయసులో నాకు ఉద్యోగం ఎవరు ఇస్తారు?’ అనుకుంది. అయితే మంజూషకు ఒక లా కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రోజూ గంటల తరబడి ప్రయాణం చేసి ఆఫీసుకు వెళ్లాలి. నీరసంగా ఉండేది, నిస్పృహగా ఉండేది. అయినప్పటికీ ‘ఇల్లు గడుస్తుందిలే’ అనే చిన్న సంతృప్తితో ఉద్యోగం చేసేది.

కొన్నిసార్లు ఉద్యోగం మానెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చేది. ఇంతలో కూతురు చదువు గుర్తుకు వచ్చి తన నిర్ణయాన్ని మార్చుకునేది. తల్లి మౌనవేదనను గమనించిన కూతురు ఆమెతో వివరంగా మాట్లాడింది. ‘నాకు ఉద్యోగం చేయాలని లేదు. కానీ తప్పదు’ అన్నది మంజూష. ‘ఉద్యోగం లేకుండా బతకలేమా!’ అన్నది కూతురు నజూక. ‘ఎలా?!’ అన్నది తల్లి.

‘కుట్లు అల్లికలు నీ హాబీ. మనం హాయిగా బతకడానికి ఈ విద్య చాలు’ అన్నది నజూక ఆత్మవిశ్వాసంతో. ఇంటిలో ఒక మూలన వన్స్‌ అపసాన్‌ ఏ టైమ్‌ కుట్టుమిషన్‌ ఉంది. ‘నీ కూతురు చెప్పింది నిజమే. ముందుకు వెళ్లు’ అన్నట్లుగా అభయం ఇచ్చింది ఆ  పాత కుట్టు మిషన్‌.

కుమార్తె నజుకా జేవియర్‌తో కలిసి ‘తోఫా’కు శ్రీకారం చుట్టింది మంజూష. ‘ఒకవేళ ఈ వ్యాపారంలో విఫలమైతే! ఏదో ఒక ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుందా....’  ఇలా రకరకాల సందేహాలు వచ్చేవి మంజూషకు. అయితే ఒక్కసారి పనిలో మునిగి΄ోయాక ఆ సందేహాలు దూరం అయ్యేవి. ఎంతో ధైర్యం వచ్చేది.

చెన్నైలో జరిగిన ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న తరువాత తనపై తనకు ఎంతో నమ్మకం వచ్చింది. ఇంటి అలంకరణలు, ఫ్యాబ్రిక్‌ డిజైన్లకు సంబంధించి తన బ్రాండ్‌కు అక్కడ మంచి స్పందన వచ్చింది. రెండు వేల రూపాయల పెట్టుబడితో మొదలు పెట్టిన ఈ బ్రాండ్‌ ఇప్పుడు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

‘సొంతంగా ఏదో ఒకటి చేయాలని ఎప్పటినుంచో అనుకునేదాన్ని. కాని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయాను. మరిచిపోయాను అనుకున్న కళ మళ్లీ నా దగ్గరకు వచ్చింది. కుట్టుపని నాలో ఆత్మవిశ్వాసాన్ని, నా జీవితంలో వెలుగుల్ని నింపింది’ అంటుంది మంజూష.

మార్కెంటింగ్‌లో పట్టా పుచ్చుకున్న కూతురు నజూక బ్రాండ్‌ రూపకల్పనలో, విజయవంతం చేయడంలో తల్లికి సహాయం అందించింది. ‘అమ్మ దుబారా ఖర్చు చేసేది కాదు. పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చేది. చిన్నప్పుడు నాకోసం బట్టలు కొనేది కాదు. పాత చీరలు, ఇతర దుస్తుల నుంచి నాకు అందమైన డ్రెస్‌లు కుట్టేది. అప్పటి ఆ విద్య వృథా పోలేదు. మాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది’ అంటుంది నజూక.

‘కుమార్తె రూపంలో యువతరంతో కనెక్ట్‌ కావడం వల్ల ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను. అప్‌డేట్‌ అయ్యాను. మా వ్యాపారంలో ఇప్పటి వరకు ప్లాస్టిక్‌ వాడలేదు’ అంటుంది మంజూష. ‘తోఫా’ ద్వారా తాను ఉపాధి పొందడమే కాదు ఎంతోమంది చేతివృత్తి కళాకారులకు ఉపాధిని ఇస్తోంది మంజూష. వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకుంటున్న మహిళలను ఉద్దేశించి... ‘భయం, సందేహాలు ఎప్పుడూ ఉండేవే. అయితే అవి మన దారికి అడ్డుపడకుండా చూసుకోవాలి’ అంటుంది.

(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది సిగరెట్‌ అంటించకండి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement