సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ బచావో ర్యాలీ సందర్భంగా శనివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో సోనియా మాట్లాడారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, దేశాన్నికాపాడుకునేందుకు కలిసి పోరాటం చేయాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మోదీ సర్కారు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని.. యువతకు ఉద్యోగాలు లేవని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోయిందని విమర్శించారు. ‘సబ్ సాత్, సబ్ కా వికాస్’ హామీ ఏమైందని సోనియా గాంధీ ప్రశ్నించారు.
పౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలబడిపోతున్నా మోదీ-షాలకు పట్టడం లేదని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ తమకు ఇష్టమొచ్చినట్టుగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తమకు కావాల్సిన చోట రాజ్యాంగ అధికరణలను విధిస్తూ, అధికరణలను రద్దు చేస్తూ రాష్ట్రాల హోదాలను మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తేసి ఎటువంటి చర్చ లేకుండానే తమకు కావాల్సిన బిల్లులు ఆమోదించుకున్నారని పేర్కొన్నారు. భారత్ బచావో ర్యాలీలో ఎంపీ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, సీనియర్ నేత చిదంబరం, తదితరులు పాల్గొన్నారు.
ఏది అడిగినా అదే చెబుతారు: చిదంబరం
ఆరు నెలల నరేంద్ర మోదీ పాలన దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని, ఇప్పటికీ మంత్రులకు దీనిపై అవగాహన లేకుండా పోయిందని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. ‘ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న కూడా పార్లమెంట్‌లో మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని.. ఆర్థికాభివృద్ధిలో ప్రపంచంలో మనం అగ్రభాగాన ఉన్నామని చెప్పారు. ఎవరు ఏది అడిగినా మంచి కాలం రాబోతుందనే ఆమె సమాధానం చెబుతార’ని చిదంబరం ఎద్దేవా చేశారు. (చదవండి: నా పేరు రాహుల్ సావర్కర్ కాదు)
Comments
Please login to add a commentAdd a comment