హార్ధిక్ పటేల్ (ఫైల్ ఫొటో)
అహ్మదాబాద్ : ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణ కులాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలనే కేంద్ర కేబినేట్ నిర్ణయాన్ని పాటిదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ తప్పుబట్టారు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అందుకే తన అమ్ములపొదిలోని చివర అస్త్రాన్ని ఈ రకంగా వదిలారన్నారు. ఈ రిజర్వేషన్ లాలీపాప్ ప్రజలకు అందిస్తే అది పెద్ద పొరబాటు అవుతుందని, సరిగ్గా అమలు చేయకపోయినా ప్రజలు తిరగబడతారని వ్యాఖ్యానించారు. మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక వెనకబడిన అగ్రవర్ణకులాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మోదీ సర్కార్ రాజ్యాంగ సవరణను చేపట్టనుంది. అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించేలా మంగళవారం ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 16, 17లకు సవరణను ప్రతిపాదించనుంది.
Comments
Please login to add a commentAdd a comment