రైల్వే వంతెన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్‌రావు
తూప్రాన్: ఎన్నికల సమయం రాగానే కొత్త బిచ్చగాళ్లు వస్తుంటారని, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్లుగా గెలువని కాంగ్రెస్‌కు మాటలు ఎక్కువని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తూప్రాన్ మండలం రామాయపల్లి సమీపంలో 44వ నంబర్ రహదారిపై వంద కోట్ల రూపాయలతో రైల్వే వంతెన నిర్మాణం పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో రైల్వే పనులు, జాతీయ రహదారులు, కరెంట్ సమస్యలతో పాటు ప్రజలకు చెప్పని ఎన్నో పథకాలను చేసి చూపిందన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దీవెనలు అందించాలని కోరారు. రూ.12 వేల కోట్లతో హైదరాబాద్ మహానగరానికి మరో రీజినల్ రింగ్‌రోడ్డును కేసీఆర్ సాధించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ రీజినల్ రింగ్‌రోడ్డు ఆరు లైన్లతో సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, జగదేవ్‌పూర్ మీదుగా, భువనగిరి వరకు ఉంటుందన్నారు.
రైల్వే లైన్లను పట్టించుకోలేదు..
డ్వాక్రా మహిళలు ఎన్నో ఏళ్లుగా వడ్డీలేని రుణాల కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 1,650 కోట్ల వడ్డీలేని రుణాలను ఇటీవల మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో 3.26 కోట్లు తూప్రాన్ మండలానికి వర్తిస్తుందన్నారు. ఎస్సీలకు 101 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు మాఫీ చేసిన ఘనత టీఆర్‌ఎస్‌కు దక్కిందన్నారు. 2006లో కాంగ్రెస్ హయాంలో మంజూరైన రైల్వే నిర్మాణం పనులు ఆ తర్వాత ఎనిమిదేళ్ల కాలంలో పట్టించుకోలేదన్నారు. నేడు అదే ప్రాజెక్టుకు రూ.1,160 కోట్ల వ్యయం పెరిగిందన్నారు.
కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి వల్లే నేడు అధిక నిధులు కేటాయించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 20 ఏళ్ళు అధికారంలో ఉన్నా ఈ పని సాధ్యమయ్యేది కాదన్నారు. కరీంనగర్, పెద్దపల్లి మీదుగా నిజామాబాద్ వరకు రైల్వేలైన్ నిర్మాణం పనులను ఎన్నేళ్లు చేశారో కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు రైల్వే నిర్మాణం పనులకు 40 ఏళ్ల కాలం పట్టిం దన్నారు. కాగా, మంత్రితో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment