సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధే ఎజెండాగా టీఆర్‌ఎస్ పని చేస్తోందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం కోర్టుల్లో కేసులు వేస్తూ అభివృద్ధికి అడ్డుపడుతోందని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పలుమార్లు పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చావు అంచుల వరకు వెళ్లి వచ్చారని, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకువచ్చారని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ ద్రోహులు మంచోళ్లయ్యారా?
హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ తీరును తూర్పార బట్టారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని విమర్శిస్తున్నారని, తెలంగాణ ద్రోహులు కోదండరాంకు మంచోళ్లయ్యారని విమర్శించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేస్తామని సీఎం కంకణం కట్టుకున్నారని, సాగునీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేద్దామంటే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అన్ని పార్టీల దారులు టీఆర్‌ఎస్ వైపే నడుస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు కలసి పాలమూరును వలసల జిల్లాగా మార్చాయని ధ్వజమెత్తారు. గత పాలకులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ కింద 20 వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. కానీ తాము మూడున్నరేళ్లలో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, 500 చెరువులను నింపామని వివరించారు.
కాంగ్రెస్, టీడీపీలకు అధికారం కలే..
కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి ఊరికి రోడ్డు వేస్తామని, ప్రతీ ఇంటికి నల్లాతో స్వచ్ఛమైన నీళ్లు అందిస్తామని హరీశ్ హామీ ఇచ్చారు. కొడంగల్ అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్, టీడీపీలు అధికారంలోకి రావడం కల్ల. మళ్లీ టీఆర్‌ఎస్‌నే అధికారంలోకి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కదు’అని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నాయకులది కుర్చీల కొట్లాట అని ఎద్దేవా చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన డీసీసీ అధికార ప్రతినిధి ఎండీ సలీం, దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, కోస్గి కాంగ్రెస్ సీనియర్ నేత సలీం, మద్దూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హనిమిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి నసీర్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు అబ్దుల్ ముజీబ్, గోకుల్ నగర్ సర్పంచ్ మీరాన్, దూద్యాల్ ఎంపీటీసీ సభ్యులు బికినీభాయ్, మద్దూరు మాజీ ఉప సర్పంచ్ చాంద్ పాషా టీఆర్‌ఎస్‌లో చేరారు.
రాష్ట్రాభివృద్ధే టీఆర్‌ఎస్ ఎజెండా
Published Thu, Nov 9 2017 2:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment