బీజేపీ రథసారథి ఎవరు?! | Heavy Competition To Karimnagar BJP President Post | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 30 2018 2:46 PM | Last Updated on Tue, Nov 6 2018 9:04 AM

Heavy Competition To Karimnagar BJP President Post - Sakshi

గంగడి కృష్ణారెడ్డి, కోమల్ల ఆంజనేయులు, గుజ్జ సతీష్‌, బాస సత్యనారాయణ, కొట్టె మురళీకృష్ణ 

భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి ఎవరనేది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఖాళీ అయిన ఆ స్థానంలో అధిష్టానం ఎవరిని నియమిస్తుందనేది హాట్‌టాపిక్‌ మారింది. ఆ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగిన కొత్త శ్రీనివాస్‌రెడ్డి ఈనెల 23న రాజీనామా చేసి గులాబీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా సారథి నియామకం అనివార్యంగా భావిస్తున్న అధిష్టానం కొత్త అధ్యక్షుడి వేటలో పడింది. జిల్లాలో నాలుగు స్థానాల నుంచి అభ్యర్థులను పోటీ దింపేందుకు పావులు కదుపుతున్న బీజేపీ ఇప్పటికే రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్‌కు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌ను ప్రకటించగా, మానకొండూరు (ఎస్సీ) నియోజకవర్గానికి గడ్డం నాగరాజును ఖరారు చేశారు. ఇదే సమయంలో హఠాత్తుగా శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు అధిష్టానం యోచిస్తుండగా, ఈ పదవి కోసం ఐదుగురు ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా ఐదుగురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో కొత్త శ్రీనివాస్‌రెడ్డితో పోటీ పడిన సీనియర్‌ నేత బాస సత్యనారాయణ పేరు ఈసారి ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్న ఆయనకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే విధంగా మరో సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమళ్ల ఆంజనేయులు కూడా జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీలో యువ నాయకత్వానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే ప్రస్తుతం జిల్లా కమిటీలో కీలకంగా ఉన్న మరో ముగ్గురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. హుజూరాబాద్‌ ప్రాంతానికి చెందిన జిల్లా ఉపాధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు.

తమిళనాడులో 2000 నుంచి 2005 వరకు పూర్తి కాల కార్యకర్తగా, ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేసి ఉపాధ్యక్షుడిగా మూడోసారి వ్యవహరిస్తున్న కృష్ణారెడ్డి పార్టీ పెద్దలతో ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్‌ నుంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కొట్టె మురళీ కృష్ణ కూడా జిల్లా పగ్గాల కోసం పయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం. విద్యార్థి దశగా ఏబీవీపీ, బీజేవైఎం, బీజేపీలలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఆయన ప్రస్తుతం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారంలో కూడా కీలకంగా పని చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న గుజ్జ సతీష్‌ కూడా జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా.. ఎన్నికల నేపథ్యంలో సీనియర్లకు అవకాశం ఇవ్వాలనుం కుంటే బాస సత్యనారాయణ, కోమళ్ల ఆంజనేయులలో ఒకరికి అవకాశం దక్కనుండగా, యువ నాయకత్వం కావాలనుకుంటే పార్టీలో పూర్తిస్థాయి కార్యకర్తలుగా ఉన్న కృష్ణారెడ్డి, మురళి, సతీష్‌లలో ఒకరి పార్టీ పగ్గాలు అందే అవకాశం ఉందన్న చర్చ పార్టీలో సాగుతోంది.
 
ఎన్నికల నేపథ్యంలో ప్రతిష్టాత్మకం.. రాష్ట్ర కమిటీ పరిశీలనలో అధ్యక్షుడి ఎంపిక..
ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులను దింపేందుకు సిద్ధమైన బీజేపీ కరీంనగర్‌ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలపై దృష్టి సారించింది. జిల్లాలో పార్టీకి మరింత ఊపు తెచ్చేందుకు ఈనెల 10 అంబేద్కర్‌ స్టేడియంలో అఖిల భారత అధ్యక్షుడు అమిత్‌షాతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, కూటమి పార్టీలను టార్గెట్‌గా చేసి మాట్లాడారు. దీంతో జిల్లాలో బీజేపీ క్యాడర్‌లో ఉత్సాహం రెట్టించింది. ఇదే సమయంలో ప్రకటించిన తొలి జాబితాలో తనకు అవకాశం కల్పించకపోగా, వివక్ష చూపుతున్నారన్న కారణాలతో కొత్త శ్రీనివాస్‌రెడ్డి పార్టీని వీడారు. వచ్చే నెల 12న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న దరిమిలా జిల్లా కొత్త అధ్యక్షుని నియామకం తప్పనిసరిగా మారింది. కాగా.. ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, ప్రకటనపై సోమవారం హైదరాబాద్‌లో ముఖ్య నేతలతో సమావేశమైన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడి నియామకంపైనా చర్చించినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement