
అభిషేక్‌గౌడతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన నిఖిల్
సుమలతకు అభినందనలు
మండ్య : రాష్ట్రంలోనే అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మండ్య లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఎన్నికలోనే ఓటమిని చవి చూసిన ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ తొలిసారిగా తన ఓటమిపై స్పందించారు. తన ఓటమికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు కారణం కాదని, తన ఓటమికి తానే బాధ్యత తీసుకుంటున్నాని తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. మండ్యలో తన ఓటమికి తానే కారణమని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేశారు. భవిష్యత్‌లో మండ్య జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ విషయంపై త్వరలో మీడియా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు.
అభినందనలు : మండ్య పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి సుమలతకు ఆయన అభినందనలు తెలిపారు. అదే విధంగా అభిషేక్ గౌడ నటించిన అమర్ సినిమా విజయవంతం కావాలని తన ట్విటర్‌లో ఆకాంక్షించారు. దీంతో నిఖిల్ కుమార స్వామి చేసిన పోస్ట్ చూసిన వేలాది మంది అభిమానులు, ప్రజలు లైక్స్ కొడుతూ తమ స్పందనలను సైతం తెలిపారు.